ముంబై: భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ యువ ఆల్‌రౌండర్ శివమ్ దూబేకు మద్దతుగా నిలిచాడు. దూబేపై అప్పుడే ఓ అంచనాకు రావొద్దు. దూబే కుదురుకునేందుకు సమయం ఇవ్వాలి అని యువరాజ్ సూచించాడు. హార్దిక్ పాండ్య స్థానంలో జట్టులోకి వచ్చిన దూబే ఇప్పటివరకు చెప్పుకోదగ్గ ఒక్క మంచి ప్రదర్శన చేయలేదు. ఇక న్యూజిలాండ్ పర్యటనలో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఇక చివరి టీ20లో ఒకే ఓవర్లో 34 పరుగులిచ్చి ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
బ్యాట్ పట్టిన లారా, పాంటింగ్.. భారీ షాట్లతో అలరించిన దిగ్గజాలు (వీడియో)
ఒకే ఓవర్లో ఏకంగా 34 పరుగులు సమర్పించుకున్న నేపథ్యంలో దూబేపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇక సోషల్ మీడియాలో అయితే విపరీతమైన ట్రోలింగ్‌కు గురయ్యాడు. ఈ నేపథ్యంల్ యువరాజ్ సింగ్ స్పందిస్తూ అతనికి మద్దతుగా నిలిచాడు. యువీ మాట్లాడుతూ... 'దూబే టాలెంట్ ఉన్న క్రికెటర్. ఇంకా నేర్చుకునే దశలో ఉన్నాడు. అంతర్జాతీయ వేదికలపై రాణించాలంటే కుదురుకునేందుకు కొంత సమయం ఇవ్వాలి. అంతేగాని విమర్శలు చేయడం తగదు. ఒక్కసారి ఫామ్ అందుకోగలిగితే నిలకడగా రాణించే సామర్థ్యం దూబేకు ఉంది' అని అన్నాడు.
'సీనియర్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మళ్లీ జ్జట్టులోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. వచ్చీ రాగానే మునుపటిలా బౌలింగ్ చేయలేకపోవచ్చు. ఎందుకంటే వెన్ను గాయానికి సర్జరీ చేయించుకున్న తర్వాత ఫాస్ట్ బౌలింగ్ చేయడం అంత సులువు కాదు. ఇప్పటివరకు దూబేకు మంచి అవకాశాలే ఇచ్చారు. భవిష్యత్‌లో ఎవరు నిలకడగా రాణిస్తారో చూడాలి' అని యువీ వెల్లడించాడు. దూబే ఇప్పటివరకు 13 టీ20లు ఆడాడు. తొమ్మిది ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసి 105 పరుగులు చేసాడు. అత్యధిక స్కోర్ 54. ఇక బౌలింగ్‌లో 10.04 ఎకానమీతో ఐదు వికెట్లే తీశాడు.
ఒక ఓవర్లో ఏకంగా 34 పరుగులు ఇవ్వడంతో దూబే ఓ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. భారత్ తరఫున ఏ ఫార్మాట్లో అయినా ఓ ఓవర్లో అత్యధిక పరుగులిచ్చిన బౌలర్‌గా నిలిచాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ పదో ఓవర్లో కివీస్ ఆటగాళ్లు టిమ్ సీఫెర్ట్, రాస్ టేలర్ విజృంభించి ఆడి 34 పరుగులు సమర్పించుకున్నాడు. 2007 టీ20 ప్రపంచకప్‌లో స్టువర్ట్ బ్రాడ్‌కు టీమిండియా ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ చుక్కలు చూపించిన సంగతి తెలిసిందే. ఒకే ఓవర్లో మొత్తం ఆరు సిక్సులు బాదడంతో..ఏకంగా 36 పరుగులు వచ్చాయి. అలా టీ20 క్రికెట్లో స్టువర్ట్ బ్రాడ్ ఎక్కువ పరుగులిచ్చిన బౌలర్‌గా తొలి స్థానంలో నిలిచాడు.