హైదరాబాద్: టీమిండియా టాప్ స్ఫిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను వెటరన్ ఆటగాడు యువరాజ్ సింగ్ ట్విట్టర్‌లో సరదాగా ఆటపట్టించాడు. కోహ్లీతో సెల్ఫీ తీసుకున్న సమయంలో వెనుకన ఉన్న అశ్విన్ ఫోటోవైపు తదేకంగా చూస్తూ ఉండిపోవడాన్ని యువీ ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు.
ఇంగ్లాండ్‌తో కోల్‌కతాలో మూడో వన్డే ఆడేందుకు గాను కటక్ నుంచి టీమిండియా విమానంలో బయల్దేరింది. పక్కనే కూర్చున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి యువరాజ్ సింగ్ సెల్ఫీ తీసుకున్నాడు. యువీ ఫోటో క్లిక్ మనిపించేటప్పుడు వెనుకాలే ఉన్న అశ్విన్ నవ్వుతూ కనిపించాడు.

ఈ ఫోటోను యువరాజ్ సింగ్ తన ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు చేసి అశ్విన్‌ను ఆటపట్టించాడు. 'ఫోటో బాంబ్ అశ్విన్‌కు థాంక్స్' అంటూ కామెంట్ పోస్టు చేశాడు. ఈ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే కటక్ వన్డేలో యువీ తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడిన సంగతి తెలిసిందే.
కటక్ వన్డేలో టాస్ ఓడిన టీమిండియా బ్యాటింగ్‌కు దిగింది. ఐదు ఓవర్లలో 25 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఔటవగానే అభిమానులు నిరాశపడ్డారు. దీంతో టీమిండియా ఎక్కువ స్కోరు చేయడం కష్టమని భావించారు. ఈ సమయంలో ఓ అద్భుతం జరిగింది.
వెటరన్ క్రికెటర్లు మహేంద్ర సింగ్ ధోని, యువరాజ్ సింగ్ పాత రోజుల్ని గుర్తుకు తెస్తూ రెచ్చిపోయారు. వీరిద్దరి జోడి పోటీపడి ఇంగ్లాండ్ బౌలర్లను ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో యువరాజ్ సింగ్ 150, ధోని 134 పరుగులతో అద్భుతమైన సెంచరీలు సాధించారు.