
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఫ్రాంఛైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్ స్టార్ హిట్టర్ క్రిస్ లిన్‌ను వచ్చే సీజన్ వేలంలోకి విడుదల చేయడంపై టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ మండిపడిన సంగతి తెలిసిందే. క్రిస్ లిన్‌ను వదిలేయడం కేకేఆర్ బ్యాడ్ కాల్‌గా యువీ పేర్కొన్నాడు.
అయితే యువీ విమర్శలపై కేకేఆర్ సీఈఓ వెంకీ మైసూర్ ఫన్నీగా స్పందించాడు. "యువరాజ్ సింగ్ మేము హిట్టర్ క్రిస్ లిన్‌ను వదిలిపెట్టాం. దీంతో కేకేఆర్ వేలంలో నిన్ను తీసుకోవడానికి బిడ్ వేయవచ్చు. ఇద్దరు చాంపియన్లు క్రిస్ లిన్, యువరాజ్‌పై ప్రేమ, గౌరవం ఎప్పటికీ ఉంటుంది" అని ట్వీట్ చేశాడు.
అసలేం జరిగింది?
క్రిస్ లిన్ (రూ. 9.6 కోట్లు)ను కేకేఆర్ అత్యధిక మొత్తం చెల్లించి కొనుగోలు చేసింది. గత సీజన్‌లో క్రిస్ లిన్ తన స్థాయి ప్రదర్శన కనబర్చకుండా జట్టుకు భారంగా మారిపోయాడు. దీంతో వచ్చే సీజన్ కోసం డిసెంబర్ 19న కోల్‌కతా వేదికగా వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో క్రిస్ లిన్‌ను వేలానికి విడుదల చేసింది.
ఈ విషయం తెలిసిన యువరాజ్ 'కేకేఆర్ క్రిస్ లిన్‌ను విడుదల చేయడం నన్ను ఆశ్చర్యంకు గురిచేసింది. ఫ్రాంఛైజీ అభిమానుల్ని కూడా షాక్‌కు గురి చేసింది. ఐపీఎల్‌లో నేను చూసిన ఒక ప్రత్యేక ఆటగాడు లిన్. కేకేఆర్‌కు ఎన్నో మంచి ఆరంభాలు ఇచ్చాడు. లిన్‌ను ఎందుకు వదులుకున్నారో నాకు నిజంగా అర్థం కావడం లేదు' అని అన్నాడు.
'అది కేకేఆర్ తప్పుడు నిర్ణయం అనుకుంటున్నా. దీనిపై కేకేఆర్ సహ యజమాని షారుఖ్ ఖాన్‌కు మెస్సేజ్ ఉందా. ప్రస్తుతం పొట్టి ఫార్మాట్‌లో లిన్ అసాధారణ ఆటగాడు' అని యువీ పేర్కొన్నాడు. యువీ విమర్శలపై కేకేఆర్ సీఈఓ వెంకీ మైసూర్ పైవిధంగా స్పందించాడు.