న్యూఢిల్లీ: టీమిండియా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్‌కు అసలే కోపమెక్కువ. కాబోయే భార్యను జాతి వివక్షకు గురిచేస్తే ఊరుకుంటాడా. అందుకే హజల్ కీచ్‌పై జాతి వివక్షను ప్రదర్శించిన ఓ అధికారిపై తీవ్ర స్థాయిలో ఫైరయ్యాడు. అతడ్ని అలా వదిలిపెట్టవద్దని స్పష్టం చేశాడు.
కాగా, తనపై జాతి వివక్ష చూపారని ఆరోపిస్తూ వెస్ట్రన్ యూనియన్ మనీ ట్రాన్స్‌ఫర్ కంపెనీ ఉద్యోగిపై హజెల్ కీచ్ కూడా మండిపడ్డారు. పియూష్ శర్మ అనే ఉద్యోగి తన పట్ల జాతి వివక్ష చూపించాడని హజెల్ కీచ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
బాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించిన హజెల్ కీచ్ దాదాపు మన దేశంలో సుపరిచితురాలే. కాగా, తన పేరు హిందూ మతానికి సంబంధించింది కాదన్న సాకుతో తనకు డబ్బు ఇచ్చేందుకు అతడు నిరాకరించాడని తెలిపింది హజెల్ కీచ్.

'నేను కలిసిన వారిలో జైపూర్‌లోని వెస్ట్రన్ యూనియన్ మనీ సంస్థలో పని చేస్తున్న పియూష్ వర్మ అత్యంత జాతివివక్ష కలిగిన వ్యక్తి. నా పేరు హిందూ మతానికి సంబంధించినది కాదన్న కారణంతో నాకు డబ్బు ఇచ్చేందుకు నిరాకరించాడు. హిందువైన నా తల్లి, ముస్లిం అయిన నా ఫ్రెండ్ ఎదురుగా నన్ను అవమానించాడు. నాకు చాలా బాధేసింది. నా పేరు హజెల్ కీచ్. నేను హిందువుగా పుట్టి పెరిగాను. కానీ, సమస్య అది కాదు. పేరు చూసి వెస్ట్రన్ యూనియన్ మనీ సంస్థ వివక్షకు పాల్పడుతుందా?' అని హజెల్ కీచ్ ట్విట్టర్ ద్వారా నిలదీశారు.
విషయం తెలిసిన వెంటనే యువరాజ్ కూడా తీవ్ర స్థాయిలో స్పందించాడు. 'పియూష్ శర్మ ప్రవర్తన నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. మనుషులుగా మనమంతా జాతి వివక్షను సహించకూడదు. ఇలాంటి వారిని విడిచిపెట్టొద్దు. శర్మపై వెస్ట్రన్ యూనియన్ మనీ కఠిన చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నా' అని యువరాజ్ ట్వీట్ చేశాడు. కాగా, గత నవంబర్‌లో హజెల్ కీచ్‌తో యువీకి ఎంగేజ్‌మెంట్ జరిగిన విషయం తెలిసిందే. అంతేగాక, త్వరలో వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు.