హైదరాబాద్: జమైకా పరుగుల చిరుత ఉసేన్ బోల్ట్ లండన్ వేదికగా తన ఆఖరి పరుగుకి సిద్ధమయ్యాడు. శుక్రవారం రాత్రి నుంచి లండన్‌లో వరల్డ్ ఛాంపియన్‌షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ వరల్డ్ చాంపియన్‌షిప్‌తో రిటైర్మెంట్ తీసుకోనున్నట్లు బోల్ట్ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.
దీంతో అందరి కళ్లు బోల్ట్ పైనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఉసేన్ బోల్ట్‌కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ బోల్ట్‌కి తనదైన శైలిలో శుభాకాంక్షలు చెబుతూ 2014లో యువీ-బోల్ట్ మధ్య జరిగిన ఓ సన్నివేశాన్ని తన ఇనిస్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నాడు.

2014లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు గాను ఉసేన్ బోల్ట్ బెంగళూరు వచ్చాడు. బోల్ట్‌కి క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో ప్రస్తావించాడు కూడా. అయితే బెంగళూరు వచ్చినప్పుడు బోల్ట్ యువీతో కలిసి సరదాగా క్రికెట్ ఆడాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి 100 మీటర్ల పరుగు పందెంలో పాల్గొన్నారు.
ఈ పరుగు పందెంలో యువరాజ్ సింగ్ విజయం సాధించాడు. బోల్ట్‌పై తాను గెలిచిన వీడియోను యువీ అభిమానులతో పంచుకున్నాడు. 'ఈ భూగ్రహంపై ఉసేన్ బోల్ట్‌ని ఓడించగలిగింది నేనొక్కడినే. నువ్వు సాధించిన విజయాలను ఎవరూ అందుకోలేరు. ఆఖరి పోటీల్లో అద్భుతంగా రాణించు' అని యువీ పోస్టు పెట్టాడు.
లండన్ వేదికగా జరుగుతున్న వరల్డ్ చాంపియన్‌షిప్‌లో ఉసేన్ బోల్ట్ కేవలం రెండు ఈవెంట్లలో మాత్రమే పరుగెత్తనున్నాడు. 100 మీటర్లు పరుగు పందెంలో సెమీస్, ఫైనల్ శనివారం జరగనున్నాయి. ఆ తర్వాత ఉసేన్ బోల్ట్ 4*100 మీటర్ల రిలేలో బోల్ట్ పాల్గొనున్నాడు.
100 మీటర్ల సెమీస్, ఫైనల్ ఆగస్టు 5 (అర్ధరాత్రి 12 నుంచి)
4X100 మీటర్ల రిలే క్వాలిఫికేషన్ ఆగస్టు 12 (సాయంత్రం 3.25కు)
4X100 మీటర్ల రిలే ఫైనల్ ఆగస్టు 12 (అర్ధరాత్రి 2.20కు)