ముంబై : మనకు తెలిసిన విరాట్ కోహ్లి.. ఓ రన్ మెషీన్. అంతకుమించి.. టార్గెట్ ను చేధించడంలో మొనగాడు. క్రీజులో అడుగుపెట్టాడంటే.. ఎంత పెద్ద లక్ష్యాన్ని అయినా అలుపు సొలుపు లేకుండా చేధించి పారేయగలడు. అయితే టీమ్ ఇండియా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ విరాట్ గురించి ఎవరికీ తెలియని ఓ విషయం చెప్పాడు. అదేంటంటే.. 'కోహ్లి చాలా పిసినారి'
ప్రస్తుత టీమ్ ఇండియా జట్టు మొత్తంలో కోహ్లీనే అందరి కంటే పెద్ద పిసినారి అని కామెంట్ చేశాడు యువీ. ఆ తర్వాతి పిసినారి స్థానం నెహ్రాది అని చెప్పుకొచ్చాడు. క్రికెటర్స్ అంతా కలిసి బయటకు వెళ్లినప్పుడు.. జేబులో నుంచి పర్సు బయటకు తీయడానికి వెనుకాడేవాడట కోహ్లి. కోహ్లి చేత డబ్బులు బయటకు తీయించడానికి తాను చాలానే కష్ట పడాల్సి వచ్చేదని చెప్పుకొచ్చాడు యువీ.
ఇక నెహ్రా అయితే.. తనకు ఫ్యామిలీ ఉంది కాబట్టి.. తాను ఎక్కువగా ఖర్చు పెట్టలేనని, అర్థం చేసుకోవాలని చెప్పేసేవాడట. ఓ రేడియో కార్యక్రమంలో పాల్గొన్న సందర్బంగా.. టీమ్ ఇండియా క్రికెటర్ల గురించి ప్రస్తావిస్తూ.. కోహ్లి, నెహ్రా ఇద్దరూ పిసినారులే అన్న విషయాన్ని గుర్తు చేసుకున్నాడు యువీ. అయితే ఇదంతా సరదాగా మాత్రమే జరిగేదని తెలిపాడు. ఇక తనకంటే సీనియర్లయిన క్రికెటర్స్ లోను పిసినారులు చాలానే ఉన్నారని చెప్పిన యువీ.. వాళ్ల పేర్లు బయట పెట్టడానికి మాత్రం ఇష్టపడలేదు.