
హైదరాబాద్: 2019 వరల్డ్ కప్ వరకు క్రికెట్ అడతానని, ఆ తర్వాతే తన రిటైర్మెంట్‌పై ఓ నిర్ణయం తీసుకుంటానని టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ అన్నాడు. ఐపీఎల్ 11వ సీజన్ తనకు ఎంతో ముఖ్యమని, ఈ సీజన్‌లో మంచి ప్రదర్శన చేసి 2019 వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసే ఆటగాళ్ల జాబితాలో తాను ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు.
'ఐపీఎల్‌లో మంచి ప్రదర్శన చేయాలని చూస్తున్నా. ఈ టోర్నీ నాకు ఎంతో ముఖ్యం. ఎందుకంటే 2019 వరకు నేను క్రికెట్ ఆడగలనా లేదా అని నిర్ణయిస్తుంది. 2019 వరకు క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నా. అప్పటివరకు ఏ మేరకు అయితే క్రికెట్ ఆడతానో.. దానిని బట్టి రిటైర్మెంట్‌పై నిర్ణయం తీసుకుంటా' అని లారస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డుల కార్యక్రమంలో యువీ పేర్కొన్నాడు.
కెరీర్ ఉన్నతస్థాయిలో ఉన్నప్పుడు కూడా టెస్టు జట్టులో చోటు దక్కించుకోలేకపోవడంపై యువరాజ్ చింతించాడు. ఈ విషయంపై యువరాజ్ మాట్లాడుతూ 'నా కెరీర్ ప్రారంభంలో 6-7 ఏళ్ల పాటు నేను అద్భుతమైన ఫామ్‌లో ఉన్నప్పుడు టెస్టు క్రికెట్ ఆడే అకాశాలు ఎక్కువ లభించలేదు. అప్పట్లో దిగ్గజాలంతా టెస్టు జట్టులో ఉండటమే అందుకు కారణం. నాకు అవకాశం వచ్చినప్పుడు క్యాన్సర్‌కు గురయ్యా' అని యువీ చెప్పాడు.
'దీనికి నేను ఎంతగానో చింతిస్తున్నా. ఇలాంటివి నా కంట్రోల్‌లో ఉండవు కదా. ప్రస్తుతం ఐపీఎల్‌లో మంచి ప్రదర్శన చేసేందుకు అసక్తిగా ఉన్నా' అని 36 ఏళ్ల యువరాజ్ సింగ్ అన్నాడు. బెంగళూరు వేదికగా జనవరి 27, 28 తేదీల్లో జరిగిన వేలంలో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ప్రాంఛైజీ యువీని రూ. 2 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
'దక్షిణాఫ్రికా సిరీస్‌లో టీమిండియా అద్భుతంగా ఆడింది. టెస్టు సిరీస్‌లో బాగా పోరాడింది. వన్డేల్లో మాత్రం అదరగొట్టింది. పరుగులు చేస్తూ కోహ్లీ జట్టును ముందుండి నడిపించాడు. స్పిన్నర్లు చాహల్, కుల్దీప్ యాదవ్ సఫారీలను బాగా ఇబ్బందుల్లోకి నెట్టారు. విదేశాల్లో మూడు సిరీస్‌లు ఆడితే రెండు గెలవడం ఆత్మవిశ్వాసం పెంచేదే' అని యువీ అన్నాడు.
'అలాగే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లో గెలిస్తే ప్రపంచంలోనే ఎక్కడైనా మనం విజయాలు సాధించగలం అన్న విశ్వాసం ఆటగాళ్లకు కలుగుతుంది. అప్పుడు ప్రపంచాన్ని జయించగలం. అండర్-19లో అదరగొట్టిన పృథ్వీ షా, శుభ్‌మాన్ గిల్, అభిషేక్ శర్మ త్వరలోనే టీమిండియా తరఫున ఆడతారు. వారు ఎంత బాగా ఆడితే అంత ఎక్కువగా సంపాదించుకోగలరు (ఐపీఎల్‌ను ఉద్దేశించి)' అని యువీ అన్నాడు.
గతేడాది ఇంగ్లాండ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన అనంతరం కరేబియన్ పర్యటనలో భారత్ తరుపున చివరగా ఆడాడు. అప్పటి నుంచి తిరిగి జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలని తీవ్రంగా కృషి చేస్తున్నాడు. ఇందులో భాగంగా యువరాజ్ సింగ్ యో-యో టెస్టు కూడా పాసయ్యాడు.