కోల్‌కతా: క్రికెట్‌లో అత్యంత గడ్డు కాలం ఎదుర్కొన్న తర్వాత టీమిండియా డ్రెస్సింగ్ రూంలోకి ఎంత తొందరగా అడుగుపెడదామా? అని ఎదురుచూస్తున్నాని క్రికెటర్ యువరాజ్ సింగ్ అన్నారు.
ఆదివారం కోల్‌కతాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం యువరాజ్ మీడియాతో మాట్లాడుతూ.. జీవితంలో తాను ఎదుర్కొన్న భయంకరమైన కాలం తనను మరింత బలవంతుడిని చేసిందని యువరాజ్ తెలిపారు. జీవితంలో, అంతర్జాతీయ క్రికెట్‌లో ఒత్తిడి ఎప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు.
తన పూర్వ ప్రదర్శన కోసం ఎదరుచూస్తున్నట్లు అభిమానులు నిరంతరం సోషల్‌మీడియా ద్వారా సందేశాలు పంపేవారని చెప్పారు. వారి అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, యువరాజ్ రీఎంట్రీపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆనందం వ్యక్తం చేశాడు.

ఢిల్లీ క్రికెట్‌కు జైట్లీ ఎంతో చేశారు: గంభీర్
ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ వివాదంలో విమర్శలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి అరుణ్ జైట్లీకి భారత క్రికెటర్ గౌతమ్ గంభీర్ అండగా నిలిచాడు. జైట్లీ డీడీసీఏ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఢిల్లీ కిక్రెట్ అభివృద్ధికి ఎంతగానో సాయపడ్డారని తెలిపారు. ఆ పదవి నుంచి ఆయన తప్పుకొన్నప్పటి నుంచి పరిస్థితులు దిగజారుతూ వచ్చాయన్నారు.
కోట్లా స్టేడియం అభివృద్ధి జైట్లీ హయాంలోనే జరిగిందని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు ఆయనను విమర్శిస్తున్న వారు... పదవుల్లో ఉన్నప్పుడు ఏం చేయలేదని గంభీర్ విమర్శించారు. అయినా జైట్లీ ఒక్కరే డీడీసీఏను నడపలేదని గంభీర్ పేర్కొన్నాడు.