
'ఎంఎస్ ధోనీ, నీతోపాటు 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్‌లను గెలవడం మర్చిపోలేను. దేశం తరఫున ఆ ట్రోఫీలను పైకెత్తిన క్షణాలను చాలా బాగా ఎంజాయ్ చేశా. అలానే మైదానంలో ఎన్నోసార్లు మన భాగస్వాములుగా ఉన్నాం. ఎన్నో మ్యాచులు గెలిపించాం. అవి కూడా మధురక్షణాలే. నీ భవిష్యత్తుకు నా బెస్ట్ విషెస్' అంటూ యువరాజ్ సింగ్ ట్వీట్ చేశాడు. యువీ షేర్ చేసిన వీడియోలో ధోనీతో కలిసి దిగిన మరపురాని ఫొటోలు ఉన్నాయి.
అంతర్జాతీయ క్రికెట్‌లో మిడిల్ ఆర్డర్‌లో విజయవంతంగా రాణించిన జోడిగా యువరాజ్ సింగ్, మహేంద్రసింగ్ ధోనీ పేరు తెచ్చుకున్నారు. మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ నేతృత్వంలోనే యువీ, మహీ జట్టులోకి వచ్చారు. టీమిండియాకు మిడిల్ ఆర్డర్‌లో ఎన్నో అద్భుత విజయాలు అందించారు. ముఖ్యంగా ఈ జంట టీ20, వన్డే ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించింది. మొహమ్మద్ కైఫ్ అనంతరం ధోనీతో కలిసి యువీ భారీ భాగస్వామ్యాలు నెలకొల్పాడు.
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఎంఎస్ ధోనీపై ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ప్రశంసల వర్షం కురిపించాడు. ధోనీ కెరీర్ అత్యద్భుతమని, తాను ధోనీని విపరీతంగా అభిమానిస్తానని వెల్లడించాడు. తాను ఎదుర్కొన్న వారిలో అద్భుతమైన ప్రత్యర్థి ధోనీనే అని కితాబిచ్చాడు. ఆసీస్ మాజీ వికెట్ \కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ కూడా ధోనీ రిటైర్‌మెంట్‌పై స్పందించి.. 'నీ స్టైల్లో అన్నీ చేశావ్' అని పేర్కొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెబుతూ ధోనీ ఆగస్టు 15న నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.