న్యూఢిల్లీ: ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తన తండ్రి యోగరాజ్ సింగ్.. భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై చేసిన తీవ్ర వ్యాఖ్యలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించాడు. మంగళవారం ఓ హిందీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యోగరాజ్ సింగ్.. ధోనీపై తీవ్రస్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే.
ధోనీ ఓ దురంహంకారి అని, భవిష్యత్‌లో అతడు చాలా క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటాడని, అడుక్కునే పరిస్థితి వస్తుందని తీవ్ర ఆరోపణలు చేశాడు. కాగా, తండ్రి వ్యాఖ్యలపై స్పందించని యువరాజ్ సింగ్.. తనకు ధోనీకి మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పాడు.
తాను ధోనీని కలిసేందుకు ఉత్సాహంగా ఉన్నానని, తండ్రి అయినందుకు అతనికి తాను శుభాకాంక్షలు తెలపాల్సి ఉందని చెప్పాడు. మీడియాలో వస్తున్న వార్తల గురించి నాకేమీ తెలియదని తెలిపాడు. తాను ధోనీ నాయకత్వంలో ఆడానని, అతనితో ఎలాంటి సమస్య లేదని ట్విట్టర్‌లో స్పష్టం చేశాడు.

'నేను ధోనీని కలిసి, అతడ్ని తండ్రి అయినందుకు శుభాకాంక్షలు తెలపాలి' అని యువరాజ్ సింగ్ ట్విట్టర్లో తెలిపాడు. గతంలో కూడా యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ ధోనీపై తీవ్ర ఆరోపణలు చేశాడు. ధోనీ వల్లే ఫాంలో ఉన్నా యువీని ప్రపంచ కప్ టోర్నీకి ఎంపిక చేయలేదని, ఇందుకు ధోనీయే కారణమని అన్నారు.
కాగా, ధోనీ, యువరాజ్ ఇద్దరూ కూడా ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్-8 కోసం సిద్ధమవుతున్నారు. యువరాజ్ సింగ్‌ని రూ. 16కోట్లు వెచ్చించి ఢిల్లీ డేర్ డెవిల్స్ కొనుగులో చేసిన విషయం తెలిసిందే. కాగా, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ధోనీ నాయకత్వం వహిస్తున్నాడు.