కోచ్ లేడు కాబట్టి: యువ క్రికెటర్లకు ధోనీ, యువీ మార్గ నిర్దేశం
హైదరాబాద్: కెప్టెన్ విరాట్ కోహ్లీతో విభేదాల కారణంగా ప్రధాన కోచ్ పదవికి అనిల్ కుంబ్లే గత వారంలో రాజీనామా చేయడంతో ప్రధాన కోచ్ లేకుండానే వెస్టిండిస్‌లో టీమిండియా పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఐదు వన్డేలు, ఒక టీ20 సిరిస్ ఆడేందుకు ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత లండన్ నుంచి నేరుగా వెస్టిండిస్‌కు కోహ్లీసేన చేరుకుంది.
ఈ నేపథ్యంలో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు కూడా ఆడింది. తొలి వన్డే వర్షం కారణంగా రద్దు కాగా, రెండో వన్డేలో వెస్టిండిస్‌పై 105 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. జట్టు ప్రాక్టీస్‌ను పర్యవేక్షించడం, ఆయా ఆటగాళ్ల గత మ్యాచ్ వైఫల్యాలను సమీక్షించి, తగిన సలహాలు, సూచనలతో వాటిని సరిదిద్దడం ప్రధాన కోచ్ ముఖ్య విధులు.

విండిస్ పర్యటనలో కోచ్ బాధ్యతను తీసుకున్న ధోని, యువీ
దీంతో పాటు మ్యాచ్‌కు ముందు జట్టు వ్యూహ రచనలో కెప్టెన్‌కు సాయపడడం కూడా కోచ్ చేసే పని. అయితే విండిస్ పర్యటనలో కోచ్ లేని నేపథ్యంలో జట్టుతో పాటు యువ ఆటగాళ్లను ఎవరు మార్గ నిర్దేశం చేస్తున్నారన్న ప్రశ్న ఉత్పన్నమైంది. అయితే వెటరన్ క్రికెటర్లు ధోనీ, యువరాజ్ తమంతట తాము ఆ బాధ్యత చేపట్టారని బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ వెల్లడించాడు.

యువ క్రికెటర్లకు ఎంతో లబ్ధి
జూనియర్ క్రికెటర్లు ముఖ్యంగా యువ ఆటగాళ్లకు వారిద్దరూ మెంటార్లుగా వ్యవహరిస్తున్నారని తెలిపాడు. ‘యువ రాజ్, ధోనీ, కోహ్లీ తెరవెనుక ఎన్నో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆటగాళ్లకు సాయపడుతున్నారు. ఒకవిధంగా చెప్పాలం టే వారికి మార్గనిర్దేశం చేస్తున్నారు. వారితో ముఖాముఖి మాట్లాడడంతో యువ క్రికెటర్లు ఎంతో లబ్ధి పొందుతున్నారు' అని వెల్లడించాడు.

300కు పైగా వన్డేలాడిన యువీ
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 292, యువరాజ్‌లు 300లకుపైగా వన్డేలు ఆడిన అనుభవజ్ఞులు. వీరిద్దరూ ఆడిన వన్డేలు వెస్టిండీస్ జట్టు ఆటగాళ్లంతా ఆడిన వన్డేలకన్నా ఎక్కువ కావడం గమనార్హం. ధోని, యువీ అపార అనుభవం యువ ఆటగాళ్ల మెళకువలు నేర్పడానికి ఎంతో తోడ్పడుతుందని సంజయ్ బంగర్ చెప్పాడు.

భారత్ భవిష్యత్తు కీపర్‌గా రిషబ్ పంత్
ముఖ్యంగా కీపర్, బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్‌కు ధోనీ ఇచ్చే సలహాలు ఎంతో విలువైనవి. భారత్ భవిష్యత్తు కీపర్‌గా పంత్‌ను పరిగణిస్తున్న సంగతి తెలిసిందే. జూలై 21 నుంచి ప్రారంభం కానున్న శ్రీలంక పర్యటనలోపే కోచ్ ఎంపిక చేస్తామని బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. ఆ సిరీస్‌లో మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఓ టీ20 మ్యాచ్ ఆడనుంది. కోచ్ నియామక ప్రక్రియ గురించి గంగూలీ, సచిన్, లక్ష్మణ్‌తో కూడిన క్రికెట్ సలహా కమిటీ నిర్ణయం తీసుకొంటుందని అన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications