హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు లండన్‌కు చేరుకున్న టీమిండియా మొదటి ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంది. సుమారు రెండు గంటల పాటు జరిగిన ఈ ప్రాక్టీస్ సెషన్‌లో యువరాజ్ మినహా మిగతా ఆటగాళ్లంతా పాల్గొన్నారు. జ్వరం కారణంగానే యువీ ఈ నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొనలేదని తెలుస్తోంది. అయితే యువరాజ్ ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, ఒకట్రెండు రోజుల్లో పూర్తిగా కోలుకుంటాడని మేనేజ్‌మెంట్ వర్గాలు తెలిపాయి.
ఎంసీసీ క్రికెట్ అకాడమీలో హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే ఆధ్వర్యంలో కోహ్లీ, ధోనీ, రహానె, అశ్విన్ తదితర ఆటగాళ్లు నెట్స్‌లో ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. ఇక భారత బౌలర్లు బ్యాట్స్ మెన్లకు తమ పదునైన బౌలింగ్‌తో బంతులు సంధించారు. కాగా ఛాంపియన్స్ టోర్నీకి ముందు టీమిండియా రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది.

తొలి వార్మప్ మ్యాచ్‌లో భాగంగా మే 28న న్యూజిలాండ్‌తో తలపడుతుండగా, మే 30వ తేదీన బంగ్లాదేశ్‌ను ఢీ కొట్టనుంది. ఆ తర్వాత జూన్ 1 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ అసలు సమరం మొదలు కానుంది. జూన్ 4న టీమిండియా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఢీ కొట్టనున్న సంగతి తెలిసిందే.
ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతుంది. మొట్టమొదటి ఛాంపియన్స్ ట్రోఫీని 1998లో బంగ్లాదేశ్‌లో నిర్వహించారు. ఈ టోర్నీలో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. టీమిండియా 2000 సంవత్సరంలో రన్నరప్‌గా నిలవగా, ఆ తర్వాత 2002లో శ్రీలంకతో సంయుక్తంగా ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది.
ధోని నేతృత్వంలోని టీమిండియా రెండోసారి 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా అవతరించింది. దీంతో ఐసీసీ నిర్వహించే మూడు ప్రధాన టోర్నీలైన వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలను ధోని నేతృత్వంలోని టీమిండియా కైవసం చేసుకుంది.