ఢిల్లీ: భారత క్రికెట్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్‌కు కోపమొచ్చింది. మీడియా ప్రతినిధులు ఊహించని ప్రశ్న అడిగేసరికి అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న యువరాజ్ సింగ్ సహనం కోల్పోయాడు. మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండానే వెళ్లిపోయాడు.
టీమిండియా టెస్ట్ కెప్టెన్ కోహ్లీ ఫౌండేషన్, మరో చారిటీ సంస్థ స్మైల్ ఫౌండేషన్ కలిసి ముంబైలో శుక్రవారం రాత్రి చారిటీ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కోహ్లీ, యువరాజ్ సింగ్, యువ ఆటగాడు హార్దిక్ పాండ్యా స్టెప్పులతో అదరగొట్టారు.
ఈ కార్యక్రమంలో ట్వంటీ 20, వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, కేఎల్ రాహుల్, అజింక్యా రహానేతో పాటు ఆకాశ్ అంబానీ, గౌతమ్ సింఘానియా తదితరులు కూడా పాల్గొన్నారు. క్రికెటర్లు చిన్నారులతో ఫోటోలు దిగి సందడి చేశారు.

ఈ కార్యక్రమానికి ముందు.. మీడియా ప్రతినిధులు యువరాజ్ సింగ్‌ను ప్రశ్నించారు. దీంతో అతను సహనం కోల్పోయాడు. అన్ని ఫార్మాట్లకు టీమిండియా కెప్టెన్‌గా విరాట్ కోహ్లీని నియమించే అవకాశం గురించి మీడియా ప్రశ్నించింది.
ఈ ప్రశ్నతో ఆశ్చర్యపోయిన యువీ.. ఈ ఈవెంట్ గురించి తాను మాట్లాడేందుకు వచ్చానని, క్రికెట్ గురించి మాట్లాడేందుకు కాదని చెప్పి, థ్యాంక్యూ అని చెప్పి మరో ప్రశ్న అడిగే అవకాశమివ్వకుండా వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఆ విషయాన్ని మరిచిపోయి.. అందరితో కలిసి సందడి చేశాడు.