
హైదరాబాద్: 2007 టీ20 వరల్డ్‌కప్, 2011 వన్డే వరల్డ్‌కప్‌ను టీమిండియా కైవసం చేసుకోవడంలో కీలకపాత్ర పోషించిన టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ సోమవారం 38వ పుట్టినరోజుని జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ వినూత్నంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి నవ్వులు పూయించాడు.
యువరాజ్ తన ట్విట్టర్‌లో "జన్మదిన శుభాకాంక్షలు సోదరా! పుట్టినరోజు కేక్ ఎక్కడా? ఓహ్ దారిలో ఉందా? ప్రేమానురాగాలతో మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలి నేతా జీ" అంటూ ట్వీట్ చేశాడు.
యువరాజ్ ట్వీట్‌కు "కృతజ్ఞతలు సోదరా! కేక్ దాని దారిలోనే ఉంది. నాతో సెలబ్రేషన్స్ చేసుకునేందుకు నువ్వు నీ మార్గంలో ఉండాలి" అంటూ గంభీర్ రీట్వీట్ చేశాడు. వీరిద్దరి సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2018 డిసెంబర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన గంభీర్ ఆ తర్వాత భారతీయ జనతా పార్టీల చేరారు.
2019 లోక్‌సభ ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. టెస్టుల్లో వరుసగా ఐదు సెంచరీలు సాధించిన ఏకైక భారత బ్యాట్స్ మెన్ గౌతమ్ గంభీరే. అలాంటి గంభీర్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో వేదికగా పలువురు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.