మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ సింగ్ తరచుగా వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. ముఖ్యంగా మాజీ క్రికెటర్లు కపిల్ దేవ్, ధోనీని విమర్శిస్తుంటారు. తాజాగా మరోసారి ఆయన కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. మహిళల గురించి, హిందీ భాషపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. దీంతో నెటిజన్లు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పెత్తనం ఇవ్వొద్దు
మహిళలకు ఇంటి పెత్తనం ఇవ్వకూడదని అన్నారు యోగ్ రాజ్ సింగ్. మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీని ఉదాహరణగా చూపిస్తూ.. "మీరు భార్యకు అధికారాన్ని ఇస్తే మీ ఇంటిని నాశనం చేస్తుంది. ఇలా చెబుతున్నందుకు బాధగా ఉంది. ఇందిరా గాంధీ దేశాన్ని పరిపాలించి నాశనం చేశారు. అందుకే మహిళలకు గౌరవం, ప్రేమను మాత్రమే ఇవ్వాలి. అధికారాన్ని మాత్రం ఇవ్వకూడదు" అంటూ వివాదస్పద కామెంట్స్ చేశారు.

హిందీ భాష అలాంటిది
ఇంకా హిందీ భాషను మహిళలతో పోలుస్తూ మాట్లాడారు యోగ్ రాజ్ సింగ్. పంజాబీ మాట్లాడేవారు మగవారు అని సంబోధించారు. "హిందీ భాష వింటుంటే ఓ మహిళా మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తుంది. ఓ మహిళా హిందీ మాట్లాడితో వినడానికి ఎంతో హాయిగా అనిపిస్తుంది. అదే ఓ మగాడు మాట్లాడితే అది కష్టంగా అనిపిస్తుంది. ఎవడ్రా వీడు, ఏం మాట్లాడుతున్నాడు అని అనిపిస్తుంది. నాకు ఆ వ్యత్యాసం అర్థమవుతుంది. నా దృష్టిలో పంజాబీ భాష మగాడి లాంటిది. హిందీ భాష మహిళా లాంటిది" అని పేర్కొన్నారు. ప్రస్తుతం యోగ్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సోషల్ మీడియాలో నెటిజన్లు ఆయన్ను తీవ్రంగా విమర్శిస్తున్నారు.
ఇకపోతే హిందీ భాష గురించి ఇటీవలే క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా విమర్శలు చేశాడు. "హిందీ అధికారిక భాష మాత్రమే. జాతీయ భాష కాదు" అని వార్తల్లో నిలిచాడు. గత కొంతకాలంగా హిందీ భాషపై తమిళనాడు రాజకీయ నేతల కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేస్తున్న పరిణామాల మధ్య అశ్విన్ ఇలా చర్చనీయాంశంమైంది.