టీమిండియా మాజీ లెజెండ్ యువరాజ్ సింగ్ కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. డిప్రెషన్ తో కొంతకాలంగా యువీ సోదరుడు జొరావర్ ఇబ్బంది పడుతున్నాడు. అతన్ని చూసుకునేందుకు ఒక కేర్ గివర్ ను ఆ కుటుంబం పనిలో పెట్టుకుంది. ఆ ఉద్యోగాన్ని హేమ కౌశిక్ అనే మహిళ దక్కించుకుంది. గతేడాది ఆమె యూవీ బ్రదర్ బాగోగులు చూసుకునే పనిలో చేరింది.
అయితే ఆమె ప్రవర్తన ఏమాత్రం బాగాలేదని భావించిన యువీ తల్లి షబ్నాం సింగ్.. హేమ ఉద్యోగంలో చేరిన 20 రోజులకే పనిలో నుంచి ఆమెను తీసేశారు. కానీ ఈ కథ అక్కడితో ముగియలేదు. ఇలా తనను అర్థాంతరంగా ఉద్యోగంలో నుంచి తీసేసిన యువీ కుటుంబంపై హేమ పగ పెంచుకుంది. తనకు భారీగా డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేసింది.

ఒకవేళ యువీ కుటుంబం తనకు డబ్బు ఇవ్వకపోతే ఆ కుటుంబం పరువు బజారుకీడుస్తానని బెదిరింపులకు దిగింది. హేమ తమను రూ.40 లక్షలు అడిగింది అని, అది చాలా పెద్ద అమౌంట్ అనడంతో వాయిదాలలో ఇవ్వాలని కోరిందని షబ్నాం తెలిపారు. దీనిలో భాగంగానే మొదటి వాయిదా కింద రూ.5 లక్షలు ఇచ్చేందుకు సిద్ధం కూడా అయ్యారు.
అయితే చివరి నిమిషంలో ఆలోచించిన ఆమె.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీన్ని ఊహించని హేమ.. డబ్బు తీసుకోవడానికి వచ్చింది. ఆమెను అక్కడే డబ్బుతో సహా రెడ్ హ్యాండెడ్ గా పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు ఈ డబ్బు సోమవారం నాడే ఇవ్వాల్సింది అని, కానీ ఆ సమయానికి అందకపోవడంతో మంగళవారానికి వాయిదా పడిందని షబ్నాం చెప్పారు.
ఇలా డబ్బు ఇవ్వకపోతే జోరావర్ పై తప్పుడు కేసులు పెడతామని, అతన్ని కోర్టుకు లాగుతానని హేమ బెదిరింపులకు పాల్పడినట్లు ఆమె వెల్లడించారు. ఈ విషయం తెలియగానే తాము రంగంలోకి దిగినట్లు పోలీసు అధికారులు తెలిపారు. హేమను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని, ఆమెపై సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని చెప్పారు.