న్యూఢిల్లీ : దేశీ క్రీడ అయిన కబడ్డీకి దేశంలో ఇప్పుడిప్పుడే ప్రాధాన్యం పెరుగుతోన్న సంగతి తెలిసిందే. పలు కబడ్డీ లీగ్ ల ఎంట్రీతో టీవీల్లోను కబడ్డీ వీక్షకుల సంఖ్య పెరిగింది. తాజాగా టీమ్ ఇండియా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ దేశంలో కబడ్డీ క్రీడాభివృద్ధి కోసం రూ.5,00,000 విరాళంగా ప్రకటించడం విశేషం.
దేశంలో కబడ్డీ పట్ల మరింత ప్రాచుర్యం కల్పించడానికి ప్రచార క్రౌడ్ ఫండింగ్ ప్రాజెక్టును చేపట్టబోతున్నారు క్రీడాధికారులు. ఇందులో భాగంగా తన వంతుగా 5లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించాడు యువీ. ప్రాజెక్టు ద్వారా సేకరించే డబ్బును కబడ్డీ క్రీడాకారులకే ఖర్చు చేయనున్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు, కొత్త క్రీడాకారుల ప్రోత్సాహం మరియు ప్రతిభగల క్రీడాకారుల గుర్తింపుకు ఈ నిధులను ఉపయోగిస్తారు.

గత నెలలో అహ్మదాబాద్‌లో జరిగిన కబడ్డీ ప్రపంచకప్‌లో భారత్ వరుసగా మూడోసారి విశ్వవిజేతగా నిలిచిన నేపథ్యంలో.. క్రీడాధికారులు 'క్రౌడ్ ఫండింగ్' చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. దీనిపై స్పందించిన యువీ.. 'కబడ్డీ కోసం ఏదైనా చేయాల్సిన సమయమిది. సాటి క్రీడాకారుడిగా, ప్రపంచ కప్ సాధించిన క్రికెట్ టీమ్ లో సభ్యుడిగా, క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ఈ విరాళం అందిస్తున్నా' అంటూ ప్రకటించాడు యువీ.
యువీ విరాళం పట్ల కబడ్డీ కెప్టెన్ అనూప్ కుమార్ హర్షం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. కబడ్డీకి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు లభిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. యువీ చేసిన ఆర్థిక సహాయం పట్ల యువీ అభిమానులతో పాటు క్రీడాభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.