హైదరాబాద్: టీమిండియా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్, బాలీవుడ్ నటి హాజెల్ కీచ్‌ల వివాహం అంగరంగ వైభవంగా ముగిసిన సంగతి తెలిసిందే. నవంబర్ 30వ తేదీన సిక్కు సంప్రదాయ ప్రకారం చండీగఢ్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఫతేగఢ్ సాహిబ్ గ్రామం వద్ద ఉన్న ధార్మిక కేంద్రం 'బాబా రాందేవ్ సింగ్ డేరా'లో అంగరంగ వైభవంగా జరగ్గా డిసెంబర్ 2(శుక్రవారం)న గోవాలో హిందూ సంప్రదాయం ప్రకారం మళ్లీ వివాహం చేసుకున్నారు.
గోవాలో యువరాజ్- హాజెల్ కీచ్‌ల పెళ్లి ఫోటోలు
గోవాలో ఆడంబరంగా జరిగిన ఈ పెళ్లి వేడుక అనంతరం యువీ తన భార్య హాజెల్ కీచ్ గురించి మాట్లాడడానికి స్టేజి పైకి వచ్చాడు. ఈ క్రమంలో తన తల్లి షబ్నం సింగ్ గురించి మాట్లాడుతూ యువీ ఉద్వేగానికి లోనయ్యాడు. తన తండ్రి నుంచి వేరుగా ఉండటంతో తన తల్లి తనని, సోదరుడు జొరావర్‌ని పెంచడానికి ఎన్నో ఇబ్బందులు పడిందని ఆవేదన చెందాడు.
అంతేకాదు తన తండ్రి లేని లోటు తమకు తెలియకుండా పెంచిందంటూ యువీ ఒక్కసారిగా ఏడ్చేశాడట. కొన్ని సంవత్సరాల క్రితం తనకు క్యాన్సర్ ఉందని తెలియగానే తొలుత కుంగిపోయానని, ఆ సమయంలో తన తల్లి షబ్నం తన వెంట ఉండి ధైర్యం చెప్పిందని యువీ గుర్తు చేసుకున్నాడు.

ఇక యువీతో పాటు తండ్రి యోగిరాజ్ సింగ్‌కు కూడా క్యాన్సర్ ఉండటం విశేషం. గొంతు క్యాన్సర్ ఉన్న యోగిరాజ్ అమెరికాలో గొంతు క్యాన్సర్ చికిత్స చేసుకున్నారు. కాగా, యువరాజ్ సింగ్ యోగరాజ్ మొదటి భార్య షబ్నం కౌర్ ద్వారా జన్మించారు. ఆ తరువాత యోగ్ రాజ్, షబ్నమ్‌లు ఇద్దరూ విడిపోగా... యోగరాజ్ సత్వీర్ కౌర్‌ను పెళ్లాడారు.
గోవాలో జరిగిన యువీ పెళ్లి వేడుకకు టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ప్రేయసి బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మతో హాజరయ్యాడు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ దంపతులు, రోహిత్ శర్మ దంపతులతో పాటు మాజీ క్రికెటర్లు జహీర్ ఖాన్, ఆశిష్ నెహ్రా తదితరులు హాజరైన వారిలో ఉన్నారు.
ఇక, డిసెంబర్ 7వ తేదీన ఢిల్లీలోని ఓ స్టార్ హోటల్‌లో వీరి వివాహ రిసెప్షన్ జరగనుంది. ఈ రిసెప్షన్‌కు ప్రధాని నరేంద్ర మోడీతో సహా బాలీవుడ్ తారలు అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ హాజరవుతున్నట్టు తెలిసింది. ఇదిలా ఉంటే గురుద్వారాలో వివాహ అనంతరం హాజెల్ కీచ్ పేరును 'గుర్బసంత్ కౌర్'గా మార్చినట్లు సమాచారం.