టీమిండియా మాజీ ఆల్‌రౌండర్, సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్ బయోపిక్ తెరకెక్కనుంది. మైదానంలో దేశం కోసం ప్రత్యర్థితో తలపడిన తీరుతో పాటు, క్యాన్సర్‌తో చేసిన యువీ పోరాటాన్ని వెండితెరపైకి తీసుకురానున్నారు. దీని గురించి మంగళవారం అధికారిక ప్రకటన విడుదల అయ్యింది.
బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ టీ సిరీస్ యువరాజ్ సింగ్ బయోపిక్‌ను రూపొందించనుంది. ఈ విషయాన్ని నిర్మాతలు భూషణ్ కుమార్, రవిభాగ్ చందక్ వెల్లడించారు. యువీ బయోపిక్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు అతిత్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్‌ను భారత్ విజయం సాధించడంలో యువరాజ్ సింగ్‌ది కీలకపాత్ర.

ఆల్‌రౌండ్‌షోతో సత్తాచాటి టీమిండియాను యువీ విశ్వవిజేతగా నిలిపాడు. 2011 వన్డే వరల్డ్ కప్‌లో ప్లేయర్ ఆఫ్ టోర్నీ అవార్డు అందుకున్నాడు. అయితే ఆ మెగాటోర్నీ సమయంలో యువీ క్యాన్సర్‌తోనూ పోరాడాడు. తనకి క్యాన్సర్ ఉందని తెలిసినా ఆటకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. వరల్డ్‌కప్ అనంతరం చికిత్స చేయించుకుని, కోలుకుని తిరిగి రీఎంట్రీ ఇచ్చాడు.
క్యాన్సర్‌ను జయించిన తీరును వివరిస్తూ 'ది టెస్ట్ ఆఫ్ మై లైప్' అనే పుస్తకాన్ని యువీ రాశాడు. అయితే రీఎంట్రీలో యువరాజ్ సింగ్ ఆకట్టుకోలేకపోయాడు. 2017లో చివరిగా భారత్ తరఫున ఆడిన యువరాజ్ 2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. కాగా, యువీ బయోపిక్‌లో హీరోగా ఎవరు నటిస్తారనే ఉత్కంఠ మొదలైంది. ఎంఎస్ ధోనీ బయోపిక్‌లో యువీ పాత్రను హెర్రీ తంగిరీ పోషించాడు.
ధోనీ సినిమాలో యువీ పాత్ర కొన్ని క్షణాలు కనిపించినా, హెర్రీ యవరాజ్‌లా ఆకట్టుకున్నాడు. దీంతో అతనికే హీరోగా అవకాశం ఇస్తారా అనే చర్చలు మొదలయ్యాయి. అయితే దేశవ్యాప్తంగా ఆదరణ ఉన్న యువీ పాత్రను అగ్రహీరోలతో చేయించాలని డిమాండ్ నెట్టింట మొదలైంది. కాగా, యువీ బయోపిక్‌లో హీరో ఎవరనే విషయంపై స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే!