
కనీస ధర రూ.కోటికే దక్కించుకున్న ముంబై
అయితే, చివర్లో యువరాజ్ సింగ్‌ని ముంబై ఇండియన్స్ కనీస ధర రూ.కోటికే దక్కించుకుంది. ఒకప్పుడు యువరాజ్ వేలంలో ఉన్నాడంటే పోటీపడి కొనుగోలు చేసే పరిస్థితి. 2015 ఐపీఎల్ వేలంలో ఢిల్లీ ఏకంగా రూ.16 కోట్లకు సొంతం చేసుకుంది. అలాంటి ప్రస్తుతం ఐపీఎల్‌లో యువీ ధర ఏటా దిగజారిపోతూ వచ్చింది. 2011లో పుణె జట్టు 1.8 మిలియన్ డాలర్లు (12.78 కోట్లు)కి యువరాజ్‌ని కొనుగోలు చేసింది. ఆ తర్వాత 2014లో ఆర్‌సీబీ రూ.14 కోట్లకి, 2015లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఏకంగా రూ.16 కోట్లు ధరకు యువీని దక్కించుకున్నాయి. ఆ తర్వాత కొనుగోలు చేసిన ధరకు యువీ సరైన న్యాయం చేయడం లేదని భావించిన ఆయా జట్లు తర్వాత ఏడాది వదిలించుకున్నాయి.

తొలి రౌండ్‌లో అమ్ముడుపోకుండా మిగిలిన యువరాజ్
కొంతకాలంగా యువీ ఏ ఫార్మాట్‌లోనూ రాణించకపోవడం.. ముఖ్యంగా టీమిండియాలో చోటు దక్కించుకోకపోవడం తదితర కారణాలతో 2019 వేలంలో యువీ తొలి రౌండ్‌లో అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. రెండో రౌండ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు రూ.కోటి (బేస్ ధర)కి కొనుగోలు చేయడంతో ఊపిరి పీల్చుకున్నాడు. ముంబై ఇండియన్స్ నిర్ణయంపై యువీ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

యువరాజ్ కొనుగోలు చేయడంపై
యువరాజ్ కొనుగోలు చేయడంపై ముంబై ఇండియన్స్ యజమాని ఆకాశ్ అంబానీ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఐపీఎల్ చరిత్రలో తమ కల ఇన్నాళ్లకు నెరవేరిందన్నాడు. యువరాజ్ లాంటి ఆటగాడిని కొనుగోలు చేయాలని ఎన్నో సీజన్లుగా అనుకుంటున్నామని ఇప్పటికి సాధ్యపడిందని చెప్పుకొచ్చాడు.

యువీ, మలింగకు భారీ మొత్తం
"యువరాజ్, మలింగలకు భారీ మొత్తంలో కేటాయించాలని నిర్ణయించుకన్నాం. యువరాజ్ బ్యాటింగ్ శైలి మాకెంతో నచ్చుతుంది. ఇంతకుముందు సీజన్లలో సొంతం చేసుకుందామని భావించినా మా దగ్గర ఉన్న మొత్తం అతనికి సరిపోయేంత లేకపోవడంతో దక్కించుకోలేకపోయాం. నిజాయతీగా చెప్పాలంటే.. యువీ, మలింగ కోసం మేం ఎక్కువ బడ్జెట్ కేటాయించాం. యువీలాంటి ఆటగాడు కోటి రూపాయలకే మాకు దక్కడం బహుశా ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద దొంగతనం. అతడు గెలవాల్సిన టోఫ్రీలన్నీ గెలిచాడు. అనుభవం ఉన్న ఆటగాళ్లతోపాటు కుర్రాళ్లపై కూడా దృష్టి పెట్టాం. యువీ, మలింగలో కొన్ని ప్రత్యేకతలను గుర్తించాం" అని ఆకాశ్ అంబానీ అన్నాడు.

తొలి రౌండ్‌లో కోనుగోలు చేయకపోవడంపై
మరోవైపు తాజా వేలంలో తొలి రౌండ్‌లో యువరాజ్‌ను ప్రాంఛైజీలు కోనుగోలు చేయకపోవడంపై యువీ మీడియాతో మాట్లాడుతూ "తొలి దశలో నా పేరు లేనందుకు నేనేం బాధపడలేదు. ఎందుకంటే అందుకు కారణమేంటో నాకు తెలుసు. ఐపీఎల్ వేలంలో వివిధ ఫ్రాంఛైజీల చూపంతా యువ క్రికెటర్ల వైపే ఉంటుంది. దూకుడు మీదున్న క్రికెటర్లనే వాళ్లు తొలుత కొనుగోలు చేస్తారు. నాకూ అలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. నా కెరీర్ తొలి నాళ్లలో ఐపీఎల్ వేలంలో నాకు మంచి గుర్తింపు ఉండేది. ఈ ఐపీఎల్‌లో ఏదో ఒక ఫ్రాంఛైంజీ దక్కించుకుంటుందని నేను ముందే ఊహించా. ఇప్పుడు ముంబై ఇండియన్స్ జట్టులో నేనున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా కోచ్‌గా జహీర్ ఖాన్ ఉంటారు. మెంటార్‌గా సచిన్, కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఉన్నారు. ఈ ముగ్గురితో నాకు చాలా అనుబంధం ఉంది. ఆకాశ్ అంబానీ నా మీద ఎంతో నమ్మకం ఉంచారు. దానిని నేను నిలబెట్టుకుంటాను" అని అన్నాడు.


Click it and Unblock the Notifications













