హైదరాబాద్: దీపావళి పండుగ సందర్భంగా ఢిల్లీలో బాణసంచా అమ్మకాలను నిషేధిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. టపాసుల అమ్మకాలపై కూడా నిషేధం విధించింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుతున్న నేపథ్యంలో, ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సుప్రీం కోర్టు ఈ తీర్పు వెలువరించింది.
సుప్రీం కోర్టు తీర్పుపై అనేక మంది సెలబ్రిటీలు సైతం హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ సైతం సుప్రీం కోర్టు తీర్పుని సమర్ధించాడు. అంతేకాదు కాలుష్య రహిత దీపావళిని జరుపుకుందామంటూ... తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోని కూడా పోస్టు చేశాడు.
దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. యువీ పెళ్లి సందర్భంగా బాణసంచా కాల్చిన ఫొటోలను షేర్ చేస్తూ సెటైర్లు విసిరారు. దీనిపై బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ స్పందిస్తూ 'పండుగ రోజు టపాసులు పేల్చడం సమర్థనీయం కాదు. కానీ పెళ్లి రోజు మాత్రం బాణసంచా కాల్చవచ్చు" అని కామెంట్ పెట్టాడు.
మరొక నెటిజన్ దీపావళికి మాత్రమే టపాసులు కాలుష్యాన్ని పెంచుతాయా? పెళ్లికి కాలిస్తే పొల్యూషన్ ఉండదా? అని ప్రశ్నించాడు. మొత్తానికి 'ఏం చెప్పావ్ యువీ' అంటూ గేలి చేస్తూ క్రికెట్ అభిమానులు ట్వీట్లు పెడుతున్నారు.