'యువరాజ్.. నా కొడుకు కెరీర్ ముగించినందుకు చాలా థాంక్యూ'

ముంబై: భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్.. క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కరలేని పేరు. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ టీమిండియా సాధించడంలో ముఖ్య పాత్ర పోషించాడు. ముఖ్యంగా 2007 టీ20 ప్రపంచకప్‌లో తన హిట్టింగ్ విశ్వరూపాన్ని ప్రపంచానికి చూపాడు. 2007 సెప్టెంబర్ 19న యువరాజ్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. దక్షిణాఫ్రికా వేదికగా 2007లో జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సులు బాదాడు. ఆ ఆరు సిక్సర్ల విధ్వంసకర ఇనింగ్స్ ఎప్పటికీ చిరస్మరణీయమే. తాజాగా యువీ ఆ ఘటనను గుర్తుచేసుకున్నాడు.

సూపర్ హీరో అయిపోయాడు:
ఒకే ఓవర్లో ఆరు సిక్సులు బాది యువరాజ్ సింగ్ 'సూపర్ హీరో' అయిపోయాడు. అదే సమయంలో స్టువర్ట్ బ్రాడ్ పరిస్థితి దయనీయంగా తయారైంది. అతని క్రికెట్ భవిష్యత్తూ ప్రశ్నార్థకమైంది. ఆస్ట్రేలియాతో సెమీఫైనల్ పోరు సందర్భంగా బ్రాడ్ తండ్రి, మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ స్వయంగా ఈ విషయమై తనతో మాట్లాడినట్లు యువీ తాజాగా గుర్తు చేసుకున్నాడు. నా కుమారుడి కెరీర్ దాదాపుగా ముగించినందుకు థాంక్యూ అని క్రిస్ బ్రాడ్ బాధతో అన్నట్టు యువీ పేర్కొన్నాడు. ఆ బాధ తనకు తెలుసని, అర్థం చేసుకోగలను బ్రాడ్ తండ్రికి చెప్పాడట. 2019లో అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన యువరాజ్.. భారత్ తరఫున 40 టెస్టులు, 304 వన్డేలు, 58 టీ20లు ఆడాడు.

నా కుమారుడి కెరీర్ ముగించినందుకు థాంక్యూ:
'ఆస్ట్రేలియాతో సెమీస్ పోరుకు స్టువర్ట్ బ్రాడ్ తండ్రి క్రిస్ బ్రాడ్ మ్యాచ్ రిఫరీ. మ్యాచ్‌కు ముందు క్రిస్ నా దగ్గరికి వచ్చి.. నా కుమారుడి కెరీర్ దాదాపుగా ముగించినందుకు థాంక్యూ అన్నాడు. 'వ్యక్తిగతంగా తీసుకోవద్దు. నా బౌలింగ్‌లోనూ అయిదు సిక్సర్లు కొట్టారు. ఆ బాధను అర్థం చేసుకోగలను' అని అతడికి చెప్పా. ఆరు సిక్సర్లు కొట్టినప్పుడు ధరించిన జెర్సీని స్టువర్ట్‌కు ఇవ్వమని ఆయన అడిగాడు. 'ఇంగ్లండ్ క్రికెట్ భవిష్యత్తు నువ్వు. గొప్ప ఘనతలు సాధిస్తావు' అని జెర్సీపై రాసి ఇచ్చా. ఇప్పుడు స్టువర్ట్ ఎంతో ఎదిగిపోయాడు. టెస్టుల్లో 500లకు పైగా వికెట్లు తీశాడు' అని యువరాజ్ సింగ్ అన్నాడు. టీమిండియాతో ఓ వన్డే మ్యాచ్‌లో యువీ బౌలింగ్‌లో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ దిమిత్రి మస్కరెన్హాస్ 5 సిక్సర్లు బాదిన విషయం తెలిసిందే.

ఆరు బంతుల్లో ఆరు సిక్సులు:
2007 సెప్టెంబర్ 19వ తేదీన డర్బన్ వేదికగా ఇంగ్లండ్, భారత్ తలపడ్డాయి. టీమిండియాకు అది తప్పక గెలవాల్సిన మ్యాచ్. కెప్టెన్ ఎంఎస్ ధోనీ, యువరాజ్ సింగ్ క్రీజులో ఉన్నారు. అప్పటికి భారత్ స్కోర్ మూడు వికెట్లకు 171. ఇంగ్లండ్ ఆటగాడు ఆండ్రూ ఫ్లింటాప్ అనవసరంగా యువీని రెచ్చగొట్టి భారీ మూల్యం చెల్లించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ వేసిన 19వ ఓవర్‌లో యువరాజ్ సింగ్ ఆరు బంతుల్లో ఆరు సిక్సులు సాధించడంతో పాటు 12 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన ప్లింటాఫ్ బౌలింగ్‌లో యువరాజ్ వరుసగా 4, 4 బాదాడు. దీంతో యువీపై ప్లింటాఫ్ నోరు జారాడు. దాంతో మైదానంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా.. ఆ కోపం తర్వాత ఓవర్ వేసిన బ్రాడ్ బౌలింగ్‌లో చూపించాడు.

18 పరుగుల తేడాతో విజయం:
ఈ మ్యాచులో వీరేంద్ర సెహ్వాగ్ (68), గౌతం గంభీర్ (58) అద్భుతమై ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఔటయ్యారు. అనంతరం యువరాజ్ (58: 16 బంతుల్లో 3x4, 7x6) చెలరేగాడు. దీంతో భారత్ 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ను ధోనీసేన 200 పరుగులకే కట్టడి చేయడంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా 18 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా ధోనీ నేతృత్వంలోని టీమిండియా తొలి ఐసీసీ వరల్డ్ టీ20 విజేతగా నిలిచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications