టీ20 ప్రపంచ కప్ 2026లో క్రికెట్ ప్రపంచం నోరెళ్లబెట్టే అద్భుతం జరిగింది. కెనడాకు చెందిన 19 ఏళ్ల యువ బ్యాటర్ యువరాజ్ సామ్రా.. న్యూజిలాండ్ జట్టుపై వీరోచిత శతకంతో గర్జించాడు. చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో కివీస్ బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ యువరాజ్ చేసిన ఈ సెంచరీ.. అతడిని ఒక్కరోజులోనే అంతర్జాతీయ స్టార్‌ను చేసింది. కేవలం 19 ఏళ్ల 141 రోజుల వయసులోనే ఈ ఘనత సాధించడం ద్వారా పురుషుల టీ20 ప్రపంచ కప్ చరిత్రలో సెంచరీ బాదిన అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా యువరాజ్ సామ్రా విశ్వవేదికపై చరిత్ర సృష్టించాడు.
అసోసియేట్ దేశాల తరఫున అరుదైన ఘనత
సాధారణంగా ప్రపంచకప్‌లో సెంచరీలంటే దిగ్గజ జట్ల ఆటగాళ్లే చేస్తుంటారనే భావన ఉంటుంది. కానీ, ఒక అసోసియేట్ టీమ్ (కెనడా) నుంచి వచ్చి సెంచరీ చేయడం మాములు విషయం కాదు. యువరాజ్ సామ్రా తన ఇన్నింగ్స్‌లో కేవలం 65 బంతుల్లో 110 పరుగులు చేశాడు. ఇందులో 58 బంతుల్లోనే తన శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఇంతకు ముందు ఏ అసోసియేట్ దేశ ఆటగాడు కూడా టీ20 ప్రపంచకప్‌లో సెంచరీ మార్కును అందుకోలేదు. ఆ రికార్డును సామ్రా తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా.. కైల్ జెమీసన్ వంటి ప్రపంచ స్థాయి బౌలర్లను సైతం పిల్లల్లా ఆడుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు.

పేరులోనే ఉంది పవర్.. యువరాజ్ సింగ్ స్ఫూర్తితో..!
ఈ కుర్రాడికి 'యువరాజ్' అనే పేరు రావడం వెనుక ఓ ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. భారత క్రికెట్ దిగ్గజం, సిక్సర్ కింగ్ యువరాజ్ సింగ్ అంటే సామ్రా తండ్రికి విపరీతమైన అభిమానం. తన కొడుకు కూడా ఆ స్థాయికి ఎదగాలని కోరుకుంటూ ఆయన పేరునే పెట్టారు. ఇప్పుడు తన తండ్రి నమ్మకాన్ని నిజం చేస్తూ.. ప్రపంచకప్‌లో సిక్సర్ల వర్షం కురిపించి తన పేరును సార్థకం చేసుకున్నాడు. కేవలం పేరులోనే కాదు, బ్యాటింగ్‌లో కూడా ఆ 'యువరాజ్' మార్క్ పవర్ సామ్రాలో కనిపిస్తుండటం విశేషం.
తొలి హాఫ్ సెంచరీనే సెంచరీగా మలిచి..
సామ్రా కెరీర్ గణాంకాలను గమనిస్తే మరో విచిత్రమైన విషయం కనిపిస్తుంది. ఈ చారిత్రాత్మక మ్యాచ్‌కు ముందు యువరాజ్ సామ్రా అంతర్జాతీయ టీ20ల్లో ఒక్క అర్ధశతకం (50) కూడా సాధించలేదు. తన బ్యాట్ నుంచి వచ్చిన మొదటి 50 పరుగుల స్కోరునే ఏకంగా రికార్డు బ్రేకింగ్ సెంచరీగా మలిచి 'టాక్ ఆఫ్ ది క్రికెట్ వరల్డ్'గా నిలిచాడు. పరుగుల కోసం యువరాజ్ సామ్రా చూపే ఆకలి, క్రీజులో అతని అంకితభావం కెనడా క్రికెట్‌కు ఒక కొత్త ఆశాకిరణంగా కనిపిస్తోంది.