ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలంపాటలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా యువరాజ్ సింగ్ రికార్డు సాధించాడు. వేలంపాటలో ఆల్ రౌండర్ యువీకి రూ. 16 కోట్లు ధర పలకడానికి ఐపీఎల్ మార్కెటే కారణమని ఢిల్లీ డేర్ డెవిల్స్ సీఈఓ హేమంత్ దువా చెప్పారు.
తాజా టోర్నమెంట్లో ప్రాంఛైజీ ఆశించిన మేరకు రాణించలేకపోతున్న యువరాజ్ సింగ్‌కు ఆ జట్టు సీఈఓ హేమంత్ మద్దతుగా నిలిచారు. పీటీఐ వార్తా సంస్ధకు ఇచ్చిన ఇంటర్యూలో ఆయన 'యువీని సాధ్యమైనంత తక్కువ ధరకు కొనుగోలు చేయాలని అనుకున్నాం. వేలంలో యువీ ధర అమాంతం పెరిగింది. అతని కోసం ప్రాంచైజీలు పోటీ పడి ధరను పెంచాయి. వేలంలో యువీ భారీ ధర పలకడానికి అతనికున్న మార్కెటే కారణం' అని హేమంత్ చెప్పారు.

'యువరాజ్ వైజాగ్‌లో ఏదైతే చెప్పాడో అది నిజం. అతనెప్పుడూ అంత ధర చెల్లించమని అడగలేదు. రూ. 16 కోట్లు చెల్లించడానికి మీరు సుముఖంగా ఉన్నారా అని అడిగిన ప్రశ్నకు గాను లేదు. ప్రాంఛైజీ యజమానిగా యువీని తక్కువ ధరకే కొనాలని చూస్తాం. కానీ, వేలం పాటలో మిగతా ప్రాంజైల దృష్ట్యా యువీకి అంత చెల్లించాల్సి వచ్చింది అని అన్నారు.
యువరాజ్‌కు జట్టు అండగా ఉంటుందని, అతను మళ్లీ తిరిగి ఫామ్‌లోకి వస్తాడని ఢిల్లీ డేర్ డెవిల్స్ హేమంత్ దువా విశ్వాసం వ్యక్తం చేశారు. అంతే కాదు క్రికెటర్లు కూడా మానవ మాత్రులేనని, ఈ విషయాన్ని అర్ధం చేసుకోవాలని కోరారు.
ఇక ప్రస్తుతం జరుగుతోన్న ఐపీఎల్ టోర్నమెంట్లో యువరాజ్ సింగ్ ఇప్పటి వరకు 12 మ్యాచ్‌ల్లో 18.63 సగటుతో 205 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో వరుస పరాజయాలతో ప్లే ఆఫ్స్ బరి నుంచి దాదాపు వైదొలిగినట్లే. ఇక ఐపీఎల్‌లో ఏమంత అత్యుత్తమ ప్రదర్శనను కనబర్చని యువరాజ్ కూడా ఫ్రాంజైజీని రూ. 16 కోట్లు పూర్తిగా చెల్లించాల్సిందేనని కోరనని యువీ ఇప్పటికే పేర్కొన్న విషయం తెలిసిందే.