న్యూఢిల్లీ: భారత ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ పైన కపిల్ దేవ్ ప్రశంసలు కురిపించాడు. మెకన్రో, డిగో మారడోనా లాంటి క్రీడా దిగ్గజాలతో యువీని పోల్చాడు. ఆ దిగ్గజాల్లాగే యువరాజ్ సింగ్‌కు జనాకర్షణ శక్తి ఉందని, అతడి ఆటను చూసేందుకు జనాలు ఎగబడతారన్నాడు.
అతను ఓ ఆసక్తికరమైన ఆటగాడని, మెకన్రో, మారడోనాల ఆటను చూసేందుకు జనాలు ఎలా వచ్చేవారే యువీ ఆట చూసేందుకు కూడా అలాగే వస్తారన్నాడు. అతడు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఏది చేసినా జనాలు ఇష్టపడతారన్నాడు. యువరాజ్ మ్యాచ్ విన్నర్ అన్నాడు.
అతడు తనను తాను పూర్తిగా నమ్ముతాడా లేదా అన్నదే అసలు ప్రశ్న అని చెప్పాడు. టీ20 ప్రపంచ కప్ వరకూ మహేంద్ర సింగ్ ధోనిని సారథిగా కొనసాగించాలన్న సెలెక్టర్ల నిర్ణయాన్ని కపిల్ దేవ్ స్వాగతించాడు. టెస్ట్ సారథి విరాట్ కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు.

విరాట్ ఫాస్ట్ బౌలర్‌లా దూకుడుగా ఉంటాడని, ఆస్ట్రేలియా లాంటి జట్టుతో ఆడినప్పుడు ఆ దూకుడు మొహంలో కనిపించడం అవసరమని, గతంలో మన జట్లు ప్రత్యర్థుల కళ్లలోకి సూటిగా చూడగలిగేది కాదన్నాడు. ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమిలతో భారత పేస్ విభాగం అద్భుతంగా ఉందన్నాడు.
అజింక్యా రహానే 'కంప్లీట్ బ్యాట్సుమెన్' అంటూ కపిల్ దేవే, వివిఎస్ లక్ష్మణ్‌లు కితాబిచ్చారు. కాగా, ఆస్ట్రేలియా పర్యటనకు వన్డేలలో సురేష్ రైనాకు చోటు దక్కక పోవడంపై కపిల్ దేవ్, వివిఎస్ లక్ష్మణ్‌లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.