
కరాచీ: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)లో ఎప్పటినుంచో రాజకీయాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఆటకు రిటైర్మెంట్ ఇచ్చిన ఎందరో దిగ్గజాలు పీసీబీ బాధ్యతలు చేపట్టారు. అయితే బోర్డులోని రాజకీయాల కారణంగా చాలామంది గడువు పూర్తవకముందే.. రాజీనామాలు చేశారు. పాకిస్థాన్ క్రికెట్ జట్టు బ్యాటింగ్ కోచ్ యూనిస్ ఖాన్ కూడా ఇటీవలే ఈ జాబితాలో చేరాడు. యూనిస్ తప్పుకోవడానికి గల కారణం తెలియరాకపోయినా.. సీనియర్ క్రికెటర్ హసన్ అలీతో గొడవే ఇందుకు కారణమని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ విషయంపై స్పందించిన యూనిస్.. అదేం లేదని తేల్చిచెప్పాడు.
ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన పాకిస్తాన్ విజయంతం అయింది. ఓ టీ20 మ్యాచ్ సందర్భంగా శిక్షణలో భాగంగా ఐస్ బాత్ (చల్లటి నీళ్లలో ఉండటం) చేయమని హసన్ అలీకి యూనిస్ ఖాన్ చెప్పాడట. కానీ ఇందుకు హసన్ తిరస్కరించాడని సమాచారం. దీంతో కోపంతో హసన్‌పై విరుచుకుపడిన యూనిస్.. ట్రైనర్ యాసిర్ మాలిక్‌కు అతడిపై ఫిర్యాదు చేశాడట. వీరి మధ్య బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్ మధ్యవర్తిత్వం చేసినా.. యూనిస్ మాత్రం తగ్గలేదట. అలీపై కోపంతోనే ఉన్నాడని తెలిసింది. ఆ గొడవ కూడా యూనిస్ తప్పుకోవడానికి ఓ కారణం అని ప్రచారం జరిగింది.
తాజాగా యూనిస్ ఖాన్ 'బోల్ న్యూస్'తో మాట్లాడుతూ... 'హసన్ అలీ నాకు క్షమాపణలు చెప్పాడు. నేను కూడా అతడిని క్షమించాను. ఆ గొడవతో పదవికి ఎలాంటి సంబంధం లేదు. నా రాజీనామాకు అలీతో జరిగిన సంఘటనను ఒక కారణంగా చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇలాంటి వార్తలు బయటకెలా వస్తాయో తెలియదు. ఆ సమయంలో ఇది చాలా వైరల్ అయింది. అలాంటివి క్రికెట్ పర్యటనల్లో మామూలే. ఇలాంటి వాటికి అంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అతడు జాతీయ జట్టుకు ఆడుతున్నాడు. ఇలాంటి వార్తలు అతడిని మానసికంగా బాధపెడతాయి' అని అన్నాడు.
బ్యాటింగ్ కోచ్ పదవికి రాజీనామా ఎందుకు ప్రకటించారు? అన్న ప్రశ్నకు యూనిస్ ఖాన్ స్పందించాడు.'నాకు, పీసీబీకి మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం మరో ఆరు నెలలు గడువు ఉంది. మేము దాని గురించి ఏం చెప్పలేం. కానీ హసన్కూ, నా రాజీనామాకు ఎలాంటి సంబంధం లేదు' అని యూనిస్ స్పష్టం చేశాడు. బ్యాటింగ్ కోచ్ లేకుండానే పాకిస్తాన్ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది. యూనిస్ పాక్ తరఫున 118 టెస్ట్‌లు, 265 వన్డేలు, 25 టీ20 మ్యాచ్‌లు ఆడి.. 41 సెంచరీలు, 81 అర్ధ సెంచరీలతో దాదాపు 18,000 వేల పరుగులు చేశాడు. యూనిస్ ఖాతాలో ఓ ట్రిపుల్ సెంచరీ కూడా ఉంది.