
హైదరాబాద్: ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన అత్యంత పిన్నవయస్కునిగా రికార్డు సృష్టించిన ప్రయాస్ రే బర్మన్ ప్రస్తుతం సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలు రాస్తున్నాడు. ప్రయాస్ బర్మన్ ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2019 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ప్రయాస్ బర్మన్ కోల్‌కతాలోని కల్యాణి పబ్లిక్ స్కూల్‌లో చదువుతున్నాడు. ఇటీవల ఎకనామిక్స్ పరీక్ష కూడా రాశాడు. ఏప్రిల్ 4న ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పరీక్ష రాయనున్నాడు. అయితే ఏప్రిల్ 2న రాజస్థాన్‌తో, ఏప్రిల్ 5న కోల్‌కతాతో బెంగళూరు తలపడనుంది. పరీక్ష రాసిన మరుసటి రోజు మళ్లీ జట్టుతో కలుస్తాడని ప్రయాస్ తండ్రి కౌశిక్ బర్మన్ తెలిపారు.
అంతేకాదు ప్రయాస్ రే బర్మన్‌కు బెంగళూరు జట్టు మేనేజ్‌మెంట్ పూర్తి సహకారాన్ని అందిస్తోందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కోచ్ గ్యారీ కిర్‌స్టెన్, కెప్టెన్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌లు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రయాస్‌ను నెట్స్‌లో ప్రోత్సహిస్తున్నారని తెలిపాడు. కాగా, గత డిసెంబర్‌లో ముగిసిన వేలంలో ప్రయాస్ రే బర్మన్‌ను బెంగళూరు రూ. 1.50 కోట్లకు దక్కించుకున్న సంగతి తెలిసిందే.
దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అతి పిన్న వయసులో కోటీశ్వరుడైన ఆటగాడిగా ప్రయాస్ రే బర్మన్ నిలిచాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున తన తొలి మ్యాచ్ ఆడాడు. పలితంగా ఐపిఎల్‌లో అరంగేట్రం చేసిన అత్యంత పిన్నవయస్కునిగా ప్రయాస్ బర్మన్ అరుదైన ఘనత సాధించాడు.
ఐపీఎల్‌లో అరంగేట్రం చేసేనాటికి ప్రయాస్ బర్మన్ వయసు 16ఏళ్ల 157 రోజులు. దాంతో ఇప్పటివరకు ముజిబ్ ఉర్ రహ్మాన్ పేరిట ఉన్న రికార్డును ప్రయాస్ బద్దలు కొట్టాడు. ముజిబ్ ఉర్ 17ఏళ్ల 11 రోజుల వయసులో ఐపిఎల్‌లో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ప్రయాస్ వికెట్లేమీ తీయకుండా 56 పరుగులు సమర్పించుకున్నాడు.