IPL 2023: ఈ కుర్రాళ్లకు ఐపీఎల్ గొప్ప ఛాన్స్.. రాణిస్తే టీమిండియాలోకి ఎంట్రీ!

గతేడాది టీ20 వరల్డ్ కప్‌లో దినేష్ కార్తీక్‌ను ఎందుకు ఎంపిక చేశారు? మంచి ఫినిషర్ లేడు కాబట్టి. ఆ పాత్ర ఎవరికైనా కష్టమే. చాలా కొద్ది మంది ఆటగాళ్లు మాత్రమే ఆ పాత్రను చక్కగా పోషించగలుగుతారు. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ వారిలో ఒకడు. ధోనీ తర్వాత టీమిండియాకు సరైన ఫినిషర్ దొరకలేదన్నది కాదనలేని సత్యం. అయితే కొందరు యువ ఆటగాళ్ల వద్ద ఇప్పుడు సరైన అవకాశం ఉంది. ఐపీఎల్‌లో రాణించి టీమిండియా తలుపు తట్టే ఛాన్స్ ఉంది. అలాంటి ఆటగాళ్లు ఎవరో ఒకసారి చూస్తే..

రియాన్ పరాగ్
తన ఆట కన్నా యాటిడ్యూడ్‌తో బాగా పాపులర్ అయిన కుర్రాడు రియాన్ పరాగ్. ఈ అస్సాం క్రికెటర్.. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అడపా దడపా రాణించాడు. అయితే అతనిపై ఆ ఫ్రాంచైజీ మాత్రం చాలా గట్టి నమ్మకం పెట్టుకుంది. అతను కచ్చితంగా అత్యుత్తమ ఫినిషర్ అవుతాడని చెప్తోంది. ఇటీవలి కాలంలో పరాగ్ కూడా తనపై అంచనాలను అందుకుంటున్నాడు. దేశవాళీల్లో అదరగొట్టాడు. అతను కనుక ఈ ఐపీఎల్‌లో రాణిస్తే టీమిండియాలో చోటు దొరకడం పెద్ద అసాధ్యం ఏమీ కాదు.

షారుఖ్ ఖాన్
తమిళ నాడు తరఫున అద్భుతంగా రాణించి, కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీ దృష్టిని కూడా ఆకర్షించిన అద్భుతమైన ఫినిషర షారుఖ్ ఖాన్. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతున్న అతను.. గతేడాది పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే దేశవాళీల్లో మంచి రికార్డు ఉన్న షారుఖ్.. ఐపీఎల్‌లో కూడా మంచి ఇన్నింగ్సులు ఆడితే కచ్చితంగా అతని కోసం టీమిండియా తలుపులు తెరుచుకునే అవకాశం ఉంది. వయసు కూడా తక్కువ కావడంతో భవిష్యత్తు గురించి ఆలోచించినా షారుఖ్‌కు జట్టులో చోటు దక్కే అవకాశాలు చాలానే కనిపిస్తున్నాయి.

అబ్దుల్ సమద్
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రిటైన్ చేసుకున్న ఆటగాళ్లలో అబ్దుల్ సమద్ ఒకడు. కెరీర్ స్ట్రైక్ రేటు 142తో మంచి విధ్వంసకర ఆటగాడిగా దేశవాళీ సర్క్యూట్‌లో పేరు సంపాదించాడు. కానీ గతేడాది ఆ జట్టులాగే అతను కూడా ఏమాత్రం ఆకట్టుకోలేదు. అతని స్ట్రైక్ రేటు బాగున్నా.. యావరేజీ చాలా తక్కువ ఉండటం కూడా గమనార్హం. అయితే ఎలాంటి బంతినైనా సిక్సర్‌గా మలచగల సత్తా అబ్దుల్ సమద్ సొంతం. అతను కనుక సన్‌రైజర్స్‌కు మంచి విజయాలు అందిస్తే.. టీమిండియాలో చేరే అవకాశాలు చాలా మెరుగవుతాయి.

జితేశ్ శర్మ
గత ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున అద్భుతంగా రాణించిన వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మ. షారుఖ్ ఖాన్, ఒడియన్ స్మిత్ వంటి వాళ్లు విఫలమైన సమయంలో జితేశ్ శర్మ అద్భుతంగా ఆడి పంజాబ్ కింగ్స్‌కు కొన్ని కీలక విజయాలు అందించాడు. దాంతో అతన్ని ఆ జట్టు కంటిన్యూ చేసింది. గత ఐపీఎల్ సీజన్లో 12 మ్యాచులు ఆడిన జితేశ్.. 163.64 స్ట్రైక్ రేటుతో 234 పరుగులు సాధించాడు. కొత్త కొత్త షాట్లతో బంతిని బౌండరీకి తరలించే అతని వంటి ఆటగాడు జట్టులో ఉండటం ఎవరికైనా బలమే. ఈ కారణంగానే అతనిపై సెలెక్టర్లు ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తోంది.

రింకూ సింగ్
చూడటానికి చంటి పిల్లాడిలా ఉండే రింకూ సింగ్.. ఒత్తిడిని తట్టుకొని భారీ షాట్లు ఆడటంలో దిట్ట. గత ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టును దాదాపుగా ప్లేఆఫ్స్ చేర్చాడీ క్రికెటర్. దానికితోడు లెఫ్ట్ హ్యాండర్ కూడా అవడం రింకూకు మరింత కలిసొచ్చే అంశం. దేశవాళీల్లో రాణించిన ఈ ఉత్తరప్రదేశ్ కుర్రాడికి గతేడాది వరకు ఐపీఎల్‌లో కంటిన్యూగా ఆడే అవకాశం రాలేదు. గతేడాది మాత్రం తనకు దక్కిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. ఈసారి కూడా రాణించాడంటే టీమిండియా తలుపులు అతని కోసం తెరుచుకోవడం గ్యారంటీ.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications