భారీ స్కోర్లతో మెరిసిన యంగ్ క్రికెటర్లు: సన్‌రైజర్స్‌లో అతను..ఆర్సీబీలో ఇతను: శుభ సంకేతం
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా జరిగిన సూపర్ శాటర్‌డే మ్యాచ్‌లు రసవత్తరంగా ముగిశాయి. ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ జట్లుగా ఉన్న ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ కుదేల్ అయ్యాయి. తమ ప్రత్యర్థులను ఓడించలేక చేతులెత్తేశాయి. ఈ రెండు జట్ల ఖాతాలో ఇప్పటిదాకా ఒక్క గెలుపు కూడా లేదు. ఆడిన నాలుగు మ్యాచ్‌లల్లోనూ అధ్వాన్న ఆటతీరుతో అవమానకరంగా ఓడిపోయాయి. ఈ సీజన్‌లో ఈ రెండు జట్ల ప్రస్థానం చివరికంటా సాగేలా కనిపించట్లేదు.

ఒకేరకంగా ఓడిన ఛాంపియన్స్..
శనివారం నాటి తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ షాక్ ఇచ్చింది. ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది. మరో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో చేతిలో దెబ్బతింది. ఏడు వికెట్ల తేడాతో ఓడింది. ఆర్సీబీ-సీఎస్‌కే జట్ల ఓటమి దాదాపుగా ఒకేలా కనిపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లల్లో 154 పరుగులు చేయగా.. రెండు వికెట్లను కోల్పోయి సన్‌రైజర్స్ దాన్ని ఛేదించింది. మరో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 151 పరుగులే చేసింది. ఆర్సీబీ మూడు వికెట్ల నష్టంతో దాన్ని అందుకుంది.

మెరిసిన యంగ్ క్రికెటర్లు..
ఈ రెండు మ్యాచ్‌లల్లో మరో భావసారూప్యం ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో యంగ్ క్రికెటర్ అభిషేక్ శర్మ అద్భుతంగా రాణించగా.. రాయల్ ఛాలెంజర్స్ జట్టులో ఆ పాత్రను మరో యంగ్‌స్టర్ అనూజ్ రావత్ పోషించాడు. వారిద్దరూ ఓపెనర్లే కావడం.. ఒకే రోజు జరిగిన రెండు వేర్వేరు మ్యాచ్‌లల్లో రాణించడం.. తమ తమ జట్ల తరఫున ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకోవడం యాదృచ్ఛికమే. భారత యువ క్రికెటర్ల సత్తాకు ఈ రెండు మ్యాచ్‌లు అద్దం పట్టాయి.

అభిషేక్ శర్మ మెరుపులు..
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో అభిషేక్ శర్మ మెరుపులు మెరిపించాడు. జట్టు భారీ తేడాతో విజయం సాధించడానికి బాటలు వేశాడు. అభిషేక్ శర్మ.. 50 బంతుల్లో 75 పరుగులు చేశాడు. ఇందులో మూడు భారీ సిక్సర్లు.. అయిదు ఫోర్లు ఉన్నాయి. ఓపెనర్‌గా బరిలోకి దిగిన అతను 18వ ఓవర్‌లో అవుట్ అయ్యాడు. అప్పటికే గెలుపు ఖాయం కావడంతో సన్‌రైజర్స్ పెద్దగా ఆందోళన పడలేదు. రాహుల్ త్రిపాఠి, నికొలస్ పూరన్ జట్టు విజయాన్ని లాంఛనంగా పూర్తి చేశారు. త్రిపాఠి 15 బంతుల్లో 39 పరుగులు చేశాడు.

అనూజ్ సిక్సర్ల పిడుగులు..
రాయల్ ఛాలెంజర్స్ జట్టులో అనూజ్ రావత్ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 47 బంతుల్లో ఆరు సిక్సర్లు, రెండు ఫోర్లతో 66 పరుగులు చేశాడు. రమణ్‌దీప్ సింగ్ విసిరిన అద్భుతమైన థ్రోకు బలి అయ్యాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన అనూజ్ రావత్ 17వ ఓవర్‌లో అవుట్ అయ్యాడు. అనూజ్ రావత్ బ్యాటింగ్ శైలికి ఫాఫ్ డుప్లెసిస్ ఫిదా అయ్యాడు. మ్యాచ్‌ను గెలిపించిన కంప్లీట్ క్రెడిట్ అతనికే దక్కుతుందని వ్యాఖ్యానించాడు. అద్భుతమైన ఆటగాడిగా అభివర్ణించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications