
హైదరాబాద్: తన అభిమాన క్రికెటర్లను చూసేందుకు ఆస్ట్రేలియాకు చెందిన ఓ చిన్నారి చేసిన సాహసం సోషల్ మీడియాలో వైరల్ అయింది. వెస్టిండిస్ వేదికగా ఇటీవల ముగిసిన వరల్డ్ టీ20 విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టు క్రికెటర్లను స్వదేశానికి ఆహ్వానించేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా మెల్‌బోర్న్‌లో ఘనంగా ఏర్పాట్లు చేసింది.
వరల్డ్ టీ20ని ఆస్ట్రేలియా జట్టు నెగ్గడం ఇది నాలుగో సారి. ఈ నేపథ్యంలో తమ దేశానికే గర్వకారణంగా నిలిచిన ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లను చూసేందుకు క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గ్రేసీ అనే ఓ చిన్నారి క్రికెట్ అంటే ప్రాణం. ఆస్ట్రేలియా క్రికెటర్లను ఎంతగానో అభిమానించే గ్రేసీ తన తండ్రితో కలిసి ఆఖరి నిమిషంలో ఫ్లైట్ ఎక్కి కాన్‌బెర్రా నుండి మెల్‌బోర్న్ చేరుకుంది.
ఫెడ్ స్క్వేర్‌లో ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లకు క్రికెట్ ఆస్ట్రేలియాతో పాటు అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఆస్ట్రేలియాను వరల్డ్ టీ20 ఛాంపియన్‌గా నిలిచేలా చేసిన క్రికెటర్లను చూసిన గ్రేసీ తెగ సంబరపడిపోయింది. గ్రేసీ ఎంతో దూరం నుంచి వచ్చిందన్న విషయం తెలుసుకున్న క్రికెట్ ఆస్ట్రేలియా గ్రేసీని నేరుగా క్రికెటర్లకు పరిచయం చేశారు.
అనంతరం తన అభిమాన క్రికెటర్లతో ఫోటోలు దిగి, ఆటోగ్రాఫ్‌లు తీసుకుని గ్రేసీ తెగ సంబరపడిపోయింది. అంతేకాదు మహిళా క్రికెటర్లు ఇచ్చిన విన్నర్స్ మెడల్‌ను కూడా గ్రేసీ ధరించింది. ఈ వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియా తమ అధికారిక ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది.