శ్రీనగర్: స్థానిక పోటీల్లో ఎన్నో ట్రోఫీలు, మెడల్స్ అందుకున్నాడు జమ్మూకాశ్మీర్ వర్ధమాన క్రికెటర్ నయీమ్ ఖాదీర్ భట్(19). కాగా, రెండు రోజుల క్రితం పనిమీద ఇంటి నుంచి బయటకు వచ్చాడు. ఆ సమయంలో రోడ్లపై పెద్ద ఎత్తున జరుగుతున్న ఆందోళనను ఫొటో తీద్దామనుకుని అక్కడే ఆగాడు. అదే అతడి ప్రాణం తీసింది.
వివరాల్లోకి వెళితే.. హంద్వారా జిల్లాలో ఇటీవల ఆందోళనకారులపై భద్రతా సిబ్బంది కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలోనే వర్ధమాన క్రికెటర్ నయీమ్ భట్ మృతిచెందాడు.
స్థానిక బాలికపై భద్రతాసిబ్బంది లైంగిక వేధింపులకు పాల్పడ్డారని కొన్ని రోజుల క్రితం పుకార్లు వ్యాపించాయి. దీంతో ఆగ్రహానికి గురైన ప్రజలు భద్రతాసిబ్బందికి వ్యతిరేకంగా పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. రాళ్లు విసిరి నిరసన వ్యక్తంచేశారు.

అదే సమయంలో రోడ్డు మీదకు వచ్చిన నయీమ్ ఘటనను తన సెల్‌పోన్‌లో ఫొటో తీసేందుకు యత్నించాడు. ఇంతలో ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో, వారిని కట్టడిచేసేందుకు భద్రతాసిబ్బంది కాల్పులు జరిపారు. వారి కాల్పుల్లో నయీమ్‌కు బుల్లెట్ తగిలి మృతిచెందాడు.
నయీమ్ మృతితో అతడి కుటుంబసభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. తన గవాస్కర్‌ను తీసుకురాండంటూ నయీమ్ తల్లి రోదించడం అందర్నీ కలచివేసింది. నయీమ్, స్నేహితులు, సన్నిహితులు విచారం వ్యక్తం చేశారు. ఓ మంచి క్రికెటర్ జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో అతనికి నివాళులర్పిస్తూ పలు ఫొటోలను పోస్ట్ చేశారు.
ఇది ఇలా ఉండగా, తనపై భద్రతా సిబ్బంది లైంగిక వేధింపులకు పాల్పడలేదని, స్థానిక యువకులే తనను వేధించారని బాధిత యువతి పేర్కొంది. ఆ వీడియోను కూడా పోలీసులు విడుదల చేశారు.