
క్రికెట్‌లో హ్యాట్రిక్ తీసుకోవడం ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. వరుసగా ముగ్గురు బౌలర్లను బోల్తా కొట్టించడం అంటే మాటలు కాదు. అందుకే హ్యాట్రిక్ తీసుకున్న బౌలర్లకు చాలా పేరు వస్తుంది. ఇప్పుడు తాజాగా ఒక బౌలర్ కేవలం ఆరు బంతుల్లో ఐదు వికెట్లు తీసుకొని అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు. మలేషియా క్వాడ్రాంగులర్ సిరీస్‌లో ఈ అరుదైన ఫీట్ నమోదైంది. ఈ సిరీస్‌లో భాగంగా బహ్రెయిన్, సింగపూర్ తలపడ్డాయి.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బహ్రెయిన్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. సింగపూర్ ఓపెనర్ అబ్దుల్ రహమాన్ (67) నిదానంగా ఆడగా.. వికెట్ కీపర్ బ్యాటర్ అమన్ దేశాయ్ (64) ధనా ధన్ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే మిగతా బ్యాటర్లు మాత్రం ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు. దీంతో సింగపూర్ జట్టు 19.5 ఓవర్లలో 168 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ ఇన్నింగ్స్‌లో బహ్రెయిన్ బౌలర్ మహమ్మద్ రిజ్వాన్ బట్ అదరగొట్టాడు. ఆరంభం నుంచి కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన అతను.. డెత్ ఓవర్లలో రెచ్చిపోయాడు.
సింగపూర్ ఇన్నింగ్స్ 18వ ఓవర్లో బంతి అందుకున్న రిజ్వాన్.. మూడో బంతికి వికెట్ తీసుకున్నాడు. ఆ మరుసటి డెలివరీకి మరో వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. మళ్లీ ఆరో బంతికి ఇంకో వికెట్ తీసుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ 20వ ఓవర్లో బంతి అందుకున్న అతను.. తొలి రెండు డెలివరీలకు రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా హ్యాట్రిక్ పూర్తి చేసుకున్నాడు.
అలాగే తను వేసిన ఆరు బంతుల్లో ఐదు వికెట్లు తీసుకొని చరిత్ర సృష్టించాడు. లక్ష్య ఛేదనలో బహ్రెయిన్ మిడిలార్డర్ రాణించడంతో ఆ జట్టు కేవలం 18 ఓవర్లలలోనే 172 పరుగులు చేసి విజయం సాధించింది. రిజ్వాన్ బౌలింగ్‌ను అందరూ మెచ్చుకుంటున్నారు.