అయిదు టెస్టుల సిరీస్‌లో భాగంగా గురువారం నుంచి భారత్-ఇంగ్లండ్ ఆఖరి టెస్టు ఆడనుంది. ఇప్పటికే సిరీస్‌ను టీమిండియా 3-1తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ధర్మశాల వేదిక జరగనున్న ఆఖరి టెస్టు నామమాత్రమైనప్పటికీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అవకాశాలు మెరుగుపర్చుకోవడానికి ఇరుజట్లకు ఇది కీలకమే కానుంది.
అయితే భారత జట్టులో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను ఎదుర్కోవడం చాలా కష్టతరమని ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ పేర్కొన్నాడు. యాష్ సంధించే బంతులు బ్యాటర్లకు సవాలుగా ఉంటాయని తెలిపాడు. ఇటీవల టెస్టుల్లో అశ్విన్ 500 వికెట్లు సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఘనత సాధించిన రెండో భారత బౌలర్ అశ్విన్. అంతకుముందు అనిల్ కుంబ్లే 500 వికెట్లు మార్క్‌ను అందుకున్నాడు.

''ప్రత్యర్థిని ఔట్ చేయడానికి అశ్విన్ ఎప్పటికప్పుడు కొత్తమార్గాలను అన్వేషిస్తూ ఉంటాడు. సంప్రదాయ ఆఫ్ స్పిన్నర్లకు భిన్నంగా అశ్విన్ క్రీజును ఉపయోగిస్తాడు. ఓవర్ స్పిన్, సైడ్ స్పిన్, స్టంప్స్‌ను టార్గెట్ చేసే బాల్స్, క్యారమ్ బాల్స్, వైడర్‌గా బౌలింగ్ చేయడం.. ఇలా అన్నిరకాలుగా అశ్విన్ బంతులు సంధిస్తుంటాడు''
''అశ్విన్ నుంచి వచ్చే ప్రమాదాలకు సిద్ధంగా ఉండాలి. అతడిపై పైచేయి సాధించాలంటే అద్భుతమైన నైపుణ్యాలు ఉండాలి. అంతేగాక అశ్విన్ మునపటి బంతిలా తర్వాత బంతిని విడుదల చేయడు. ఒక బంతిని ఆడకుండా వదిలిస్తే, తర్వాత బంతిని కచ్చితండా ఆడేలా బౌలింగ్ చేస్తాడు. బ్యాటుకు ఎడ్జ్ తీసుకునేలా బంతులు విసురుతాడు'' అని జో రూట్ పేర్కొన్నాడు.
ఆఖరి మ్యాచ్ జరగనున్న ధర్మశాల టెస్టు అశ్విన్‌కు ఎంతో స్పెషల్ కానుంది. తన కెరీర్‌లో అశ్విన్ 100వ టెస్టు ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలో అందరి చూపు అశ్విన్‌పై నెలకొంది. సాధారణంగానే ప్రత్యర్థిపై రెచ్చిపోయే అశ్విన్ తనకు ప్రత్యేకమైన టెస్టులో ఎలాంటి ప్రదర్శన చేస్తాడనే ఆసక్తి అందరిలోనూ పెరిగింది. మరోవైపు ఇంగ్లండ్ ప్లేయర్ జానీ బెయిర్‌స్టో కూడా 100 టెస్టు మ్యాచ్ ఆడనుండటం విశేషం. అయితే బెయిర్‌స్టో పేలవఫామ్ కొనసాగిస్తున్నాడు. గత నాలుగు టెస్టుల్లో వరుసగా 37, 10, 25, 26, 0, 4, 38, 30 పరుగులే చేశాడు.