'రైనా నువ్ జట్టులో ఉండాలని ప్రతి సిరీస్‌లో మాట్లాడుకుంటున్నాం.. కానీ సెలక్షన్ మా చేతుల్లో ఉండదు'

ముంబై: తనలో ఇంకా క్రికెట్ మిగిలే ఉందని, దేశానికి ప్రాతినిధ్యం వహించేందుకు తహతహలాడుతున్నానని భారత వెటరన్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా పేర్కొన్నాడు. కరోనా వైరస్ (కొవిడ్-19) వ్యాప్తి కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 నిరవధికంగా వాయిదా పడటంతో ఆటగాళ్లంతా ఇళ్లకే పరిమితమయ్యారు. మంగళవారం టీమిండియా వన్డే, టీ20 జట్టు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మతో ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో మాట్లాడిన రైనా.. తన మనసులోని మాటలను బయటపెట్టాడు.

నాలో క్రికెట్ మిగిలే ఉంది:
సురేష్ రైనా మాట్లాడుతూ... 'మోకాలి గాయం తర్వాత నన్ను నేను పూర్తిగా మార్చుకున్నా. నా తప్పిదాల్ని దిద్దుకున్నా. చాలా కష్టపడి.. బీసీసీఐ నిర్దేశించిన యో-యో టెస్టులో కూడా పాసయ్యాను. తిరిగి జట్టులోకి వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నా. కష్టకాలంలో ఎంతో మంతి సీనియర్ ఆటగాళ్లు నాకు అండగా నిలిచారు. ఇప్పటికి నాలో క్రికెట్ మిగిలే ఉంది' అని చెప్పాడు. తనలో ఇంకా క్రికెట్ ఆడే సామర్థ్యం ఉందని చెప్పుకొస్తూ పరోక్షంగా సెలక్టర్ల తీరుపై రైనా మండిపడ్డాడు.

జట్టు సెలక్షన్ మా చేతుల్లో ఉండదు:
భారత సెలక్టర్ల తీరు గురించి పరోక్షంగా సురేష్ రైనా మండిపడటంతో రోహిత్ శర్మ మాట్లాడుతూ...'రైనా భాయ్.. నిన్ను మళ్లీ భారత్ జట్టులోకి తీసుకునే విషయంపై మేము ప్రతి సిరీస్‌లోనూ మాట్లాడుకుంటున్నాం. కానీ.. జట్టు సెలక్షన్ మా చేతుల్లో ఉండదు. నిరాశకి గురవకుండా నీ ప్రాక్టీస్ ఇలానే కొనసాగించు. ఎదో రోజు అవకాశం వస్తుంది' అని సూచించాడు.

రైనా ఆశలకు కరోనా గండి:
2018 జులైలో చివరగా భారత్ తరఫున మ్యాచ్‌లు ఆడిన సురేష్ రైనా.. ఆ తర్వాత పేలవ ఫామ్, గాయం కారణంగా జట్టులో చోటు కోల్పోయాడు. ప్రస్తుతం టీమిండియా మిడిలార్డర్‌లో యువ ఆటగాళ్లు శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండే నిలకడగా రాణిస్తుండటంతో రైనా మళ్లీ రీఎంట్రీ ఇచ్చే సూచనలు కనిపించడం లేదు. ఇక ఐపీఎల్ 2020 సీజన్‌లో మంచి ప్రదర్శన చేసి ఈ ఏడాది అక్టోబరులో జరిగే టీ20 ప్రపంచకప్‌కి టీమిండియాలో చోటు దక్కించుకోవాలని రైనా ఆశించాడు. అయితే ఐపీఎల్-13ను రద్దు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైనా ఆశలకు కరోనా గండి కొట్టేలా ఉంది.

గతేడాది జూలైలో చివరి వన్డే:
భారత్ తరఫున రైనా 18 టెస్టులు, 226 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. 2006లో అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేసిన సురేశ్ రైనా.. 78 టీ20 మ్యాచ్‌లాడి 134.79 స్ట్రైక్‌రేట్‌తో 1,604 పరుగులు చేశాడు. గత ఏడాది జూలైలో చివరిగా వన్డే ఆడిన రైనా.. ఆ తర్వాత పేలవ ఫామ్ కారణంగా జట్టులో చోటు కోల్పోయాడు. ప్రస్తుతం రీఎంట్రీ కోసం రైనా ఎదురుచూస్తున్నాడు. టీ20 వరల్డ్‌కప్ జరగనుండగా.. ఆ టోర్నీలో ఆడి రిటైర్మెంట్ ప్రకటించాలని 33 ఏళ్ల రైనా ఆశిస్తున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications