
హైదరాబాద్: ఇటీవల జరిగిన మ్యాచ్‌లలో ఆఖరి మ్యాచ్‌ను మినహాయించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుస విజయాలతో దూసుకెళ్లింది. అయితే ఈ మ్యాచ్‌లలో కెప్టెన్ విరాట్ ప్రదర్శన అంతగా ఏం ప్రభావం చూపించలేదు. ఈ క్రమంలో విరాట్ ఫిట్‌నెస్ కోల్పోయాడంటూ.. చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ ట్వీట్‌పై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి చేసిన ఓ ట్వీట్ ఆసక్తికరంగా మారింది. వీటిపై కోహ్లి స్పందిస్తూ ట్విటర్ వేదికగా అభిమానులకు వివరణ ఇచ్చాడు.
'ప్రతి విషయాన్ని నాకు అంటగడుతూ.. నా ఫిట్‌నెస్‌పై తప్పుడు ఫొటోలను ప్రచారం చేస్తున్నారు. వీటన్నిటికి నేటి మ్యాచ్ స్ట్రాటజిక్ టైమ్ అవుట్‌లో సమాధానాలు తెలియజేస్తాను. ఇక నేను తీసుకునే ఆహారం విషయంలో ఎంతో జాగ్రత్త వహిస్తాను. ఇంటి ఫుడ్‌నే తీసుకుంటాను. కనీస చిప్స్ కూడా తినను. నా ఆరోగ్యం పట్ల మీ ఆందోళనను నేను అర్ధం చేసుకున్నాను. పూర్తి ఫిట్‌నెస్‌గా ఉన్నాను. ఈ విషయంలో మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు' అని కోహ్లి అభిమానులకు విజ్ఞప్తి చేశాడు.
ఇక ఐపీఎల్‌లో కోహ్లి కెప్టెన్సీ వహించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు శనివారం రాజస్తాన్ రాయల్స్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. బట్లర్, స్టోక్స్ లాంటి కీలక ఆటగాళ్ల గైర్హాజరీలో బలహీన పడ్డ రాజస్థాన్.. ఆ జట్టును 30 పరుగుల తేడాతో మట్టికరిపించింది. శనివారం మొదట త్రిపాఠి రాణించడంతో రాజస్థాన్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. ఉమేశ్ యాదవ్ (3/25) మరోసారి చక్కటి ప్రదర్శనతో రాజస్థాన్ భారీ స్కోరు చేయకుండా కళ్లెం వేశాడు. అనంతరం గోపాల్ ధాటికి బెంగళూరు 19.2 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది. డివిలియర్స్ (53) పోరాటం వృథా అయింది.
మ్యాచ్ పరాజయంపై స్పందించిన కోహ్లీ:
ఏబీ డివిలియర్స్‌పై భారం మరీ ఎక్కువైపోయింది. ఓ దశలో మేం మంచి స్థితిలో ఉన్నాం. 75/1తో ఉన్న మేము కుప్పకూలిన తీరు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఓవైపు ఏబీ చక్కగా ఆడుతున్నా మిగతా వాళ్లు చేతులెత్తేయడం నిరాశ కలిగించింది. మేం మిడిలార్డర్‌ను బలోపేతం చేయాలనుకున్నాం. కొన్నేళ్లుగా అక్కడ మేం బలంగా లేం. వచ్చే సీజన్‌లో మిడిల్ ఆర్డర్‌పై దృష్టిపెట్టాలి. జట్టు కూర్పు విషయంలో మరింత తెలివిగా వ్యవహరించాలి. మిడిల్ ఆర్డర్‌లో ఎక్కువ పరుగులు చేసే బాధ్యత, భారం ఎప్పుడూ డివిలియర్స్‌పైనే ఉండడం సరికాదు.