న్యూఢిల్లీ : క్రికెట్ బ్యాట్ విడిచిపెట్టాక.. సోషల్ మీడియా ట్వీట్స్ తో సిక్సర్స్ బాదుతున్నాడు టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ వీరెంద్ర సెహ్వాగ్. నిన్ననే 'దేవుడు గారూ.. కాస్త కామెంటేటర్స్ ను కూడా ప్రోత్సహించండి' అంటూ సరదా వ్యాఖ్యలు చేసిన సెహ్వాగ్.. తాజాగా అలనాటి బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నాకు తనదైన పంచ్ డైలాగ్ తో పుట్టినరోజు విషెస్ చెప్పాడు.
కారులో కూర్చొని చెరుకు రసం తాగుతున్న ఫోటో ఒకటి ట్విట్టర్ లో పోస్ట్ చేసిన సెహ్వాగ్.. వినోద్ ఖన్నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేందుకు చెరుకు రసం తాగుదాం.. అంటూ ఛలోక్తి విసిరాడు. 'టుడే లెట్స్ డ్రింక్ జ్యూస్ ఆఫ్ గనా.. టూ విష్ హ్యాపీ బర్త్ డే టూ వినోద్ ఖన్నా' అంటూ ప్రాస డైలాగ్ తో దంచేశాడు. ఆట నుంచి రిటైర్డ్ అయ్యాక సోషల్ మీడియాలో యాక్టివ్ అయిన సెహ్వాగ్ తనదైన ట్వీట్స్ తో అభిమానులను అలరిస్తున్నాడు.
ఏదేమైనా సోషల్ మీడియాలో సెహ్వాగ్ ట్వీట్స్ ను అభిమానులు మాత్రం తెగ ఎంజాయ్ చేస్తున్నారు. కాగా, నేటితో వినోద్ ఖన్నా 70వ వడిలోకి అడుగుపెట్టారు.