'ధోని విలువను లెక్కకట్టలేం... కోహ్లీకి ధోనిపై నమ్మకం ఎక్కువ'


హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని విలువను లెక్కకట్టలేమని మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అన్నాడు. గత కొంతకాలంగా పేలవ ప్రదర్శనతో ధోని విమర్శలను ఎదుర్కొంటోన్న సంగతి తలిసిందే. ఆసీస్‌తో జరిగిన తొలి వన్డేలో ధోని 96 బంతుల్లో 51 పరుగులు చేసినప్పటికీ అతడిపై విమర్శలు ఆగలేదు.
ఎప్పుడో ఒకసారి బాగా ఆడడం కాదు.. టీమిండియాను గెలిపించేలా ఆడాలి అంటూ విమర్శలు వచ్చాయి. అయితే, మంగళవారం అడిలైడ్ వేదికగా చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన రెండో వన్డేలో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించి, తనను విమర్శిస్తున్న వారు సైతం ప్రశంసించేలా చేసుకున్నాడు.

బ్యాటింగ్‌లో నిలకడ లేకపోయినా
దీంతో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ బ్యాటింగ్‌లో నిలకడ లేకపోయినా.. అతని ప్రదర్శనను తక్కువగా అంచనా వేయొద్దని సూచించాడు. ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్యూలో గవాస్కర్ మాట్లాడుతూ "మహీని ఒంటరిగా వదిలేయాలని నా విజ్ఞప్తి. యువ క్రికెటర్లలో ఉండే నిలకడ అతనిలో లేకపోవచ్చు. కానీ జట్టులో అతని విలువను లెక్కకట్టలేం" అని అన్నాడు.

కొద్దిగా ఓపిక పట్టండి
"కొద్దిగా ఓపిక పట్టండి. అతడేంటో, అతని విలువేంటో తెలిసిపోతుంది. రాబోయే వరల్డ్‌కప్‌లో ధోని అత్యంత కీలకం. ఇప్పటికీ అతను విలువైన ఆటగాడే. మ్యాచ్ చివరి ఓవర్లలో విరాట్ కోహ్లీ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేయడం సరైందే. వికెట్ల వెనుక ఉండే ధోని మ్యాచ్ పరిస్థితులను సరిగా అంచనా వేసి అవసరమైన చిన్నపాటి మార్పులు అద్భుతంగా చేస్తున్నాడు" అని అన్నాడు.

కోహ్లీకి ధోనిపై నమ్మకం ఎక్కువ
"విరాట్ కోహ్లీకి ధోనిపై నమ్మకం ఎక్కువ. ప్రతి బంతికి బౌలర్ దగ్గరకు వెళ్లి కెప్టెన్ సలహాలు ఇవ్వలేడు. కానీ వికెట్ల వెనుక ఉండే ధోని ఈ పనిని అద్భుతంగా చేస్తున్నాడు. ఫీల్డింగ్ మార్పులను కూడా వేగంగా చేస్తున్నాడు. చివర్లో విరాట్ కోహ్లీ బౌండరీ లైన్ దగ్గర ఉండటం జట్టుకు చాలా లాభిస్తుంది. పరుగులు ఆపడంతోపాటు కీలకమైన క్యాచ్‌లు అందుకుంటాడు. దీనివల్ల బౌలర్లపై ఒత్తిడి తగ్గుతుంది" అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications