కాన్‌బెర్రా: క్రికెటర్‌గా తాను ఇంకా ముందుకు సాగాల్సి ఉందని భారత్ స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ అన్నాడు. వన్డేల్లో అతి వేగంగా 7 వేల పరుగులు, 24 సెంచరీలు సాధించి అతను సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజాల రికార్డును బద్దలు కొట్టాడు. ప్రత్యర్థులు ఎప్పుడూ అవుట్ చేయడానికి చూస్తుంటారని, వారికన్నా నువ్వు ముందుండాల్సి ఉంటుందని ఆయన అన్నాడు.
ప్రతి రోజూ తనకు నేర్చుకున్నట్లే ఉంటుందని, మైదానంలో ఎంతో కొంత కొత్తది నేర్చుకుంటానని అన్నాడు. ఫేస్‌బుక్ వీడియో చాట్‌లో ఆయన మంగళవారంనాడు మాట్లాడాడు. ఆటగాళ్లు తాము అత్యున్నత స్థాయి ఆటను ప్రదర్శిస్తామని అనుకోరని, చాలా వరకు తాను దాన్ని సాధించాలని చూస్తున్నానని అన్నాడు.
జట్టు కోసం తాను సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు చేయాలని అనుకుంటానని, తాను రికార్డులపై దృష్టి పెట్టనని, దేవుడు తన పట్ల దయగా ఉన్నాడని కోహ్లీ అన్నాడు. వెనక్కి తిరిగి చూసుకుంటే అది ప్రత్యేకమని అనిపిస్తుందని, కానీ రికార్డుల కోసం తాను ప్లాన్ చేసుకోనని అన్నాడు.

తన సోదరుడు స్టాండ్‌లోంచి చూస్తుంటే సెంచరీ సాధించడం తనకు ప్రత్యేకమైందేనని, తనను చూడడానికి ఒక రోజు కోసం వచ్చాడని, అతని పర్యటన ఫలించినందుకు సంతోషంగా ఉందని కోహ్లీ అన్నాడు. జట్టు కోసం సేవలందిస్తున్నప్పుడు తాను ఎక్కడ ఆడుతున్నాడనేది ముఖ్యం కాదని, పరిస్తితుల ప్రభావం ఉండదని అన్నాడు.
స్వదేశంలో ఆడినా, విదేశాల్లో ఆడినా ప్రతి ఆటనూ తాను అలాగే తీసుకుంటానని, ప్రతి మ్యాచులో తాను పరుగులు చేయాలని అనుకుంటానని, తన జట్టు కోసం విజయం సాధించాలని ఆశిస్తానని, కొంత ఎక్కువ ఒత్తిడిని పెట్టుకుంటే పరిస్థితులను అర్థం చేసుకోవచ్చునని అన్నాడు. క్రికెట్ చాలా సాధారణమైన ఆట అని, దాన్ని సాధారణంగానే ఉంచాలని చూస్తానని అన్నాడు.
ట్వంటీ20లో యువరాజ్ సింగ్‌తో కలిసి ఆడడానికి కోహ్లీ ఆతురత కనబరుస్తున్నట్లు అనిపించాడు. యువరాజ్ తనకు ఎంతో సన్నిహితుడని, తనకు అన్నయ్యలాంటివాడని, యువరాజ్‌ను ఎల్లవేళలా ఇష్టపడుతానని చెప్పాడు. యువరాజ్ అద్భుతమైన వ్యక్తి అని, ఆ విషయం చాలా మందికి తెలియదని కోహ్లీ అన్నాడు.
యువరాజ్‌పై కొందరికి తప్పుడు అభిప్రాయాలున్నాయని, యువరాజ్ కఠినమైన శ్రమ చేస్తాడని, భారత్ కోసం ఆడడాన్ని గర్వంగా భావిస్తాడని, తనకు ఎల్లవేళలా మార్గదర్శకత్వం వహిస్తుననాడని, యువరాజ్‌తో కలిసి ట్వంటీ20 ఆడడానికి తాను ఎంతో ఉద్వేగంతో ఉన్నానని ఆయన చెప్పాడు.