
హైదరాబాద్: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ స్నేహం గురించి తెలియని క్రికెట్ అభిమానులు ఉండరు. చిన్ననాటి నుంచే ఒకే జట్టు తరఫున ఆడుతూ రికార్డు స్థాయి ప్రదర్శనతో జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నారు.
ఆ తర్వాత సచిన్ టెండూల్కర్ ప్రపంచంలోనే అత్యుత్తమ స్థాయి ఆటగాడిగా మారగా.. కాంబ్లీలో గొప్ప నైపుణ్యం ఉన్నప్పటికీ అనవసర వివాదాలతో దారి తప్పాడు. అయినప్పటికీ వీరిద్దరి స్నేహంలో ఎలాంటి మార్పులు రాలేదు. మధ్యలో కొన్ని అభిప్రాయభేదాలు వచ్చినా ఆ తర్వాత కలిసిపోయారు.
అంతర్జాతీయ క్రికెట్‌కు సచిన్ వీడ్కోలు పలికిన తర్వాత ఎక్కువ సమయాన్ని తన స్నేహితులతో పాటు కుటుంబ సభ్యులతో గడుపుతున్నాడు. ఈ క్రమంలో అనేకసార్లు సచిన్, కాంబ్లీ కలుసుకుంటున్నారు. తాజాగా ఆగస్టు 5(ఆదివారం) స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కాంబ్లీ తనదైన శైలిలో ట్వీట్ చేశాడు.
"ఆన్ ఫీల్డ్‌లో నువ్వు క్రికెట్‌కు లభించిన అత్యద్భుత ఆటగాడివి. కానీ మైదానం అవతల నువ్వు జై అయితే నేను వీరూని. ఈ స్నేహితుల దినోత్సవాన నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఈ స్నేహాన్ని మనం విడదీయలేము.. మరణించినా నీ స్నేహం వీడను (యే దోస్తీ.. హమ్ నహీ తోడెంగే.. తోడెంగే దమ్ మగర్.. తేరా సాత్ నా చోడెంగే)" అని షోలేలో పాటను ఉదహరిస్తూ ట్వీట్ చేశాడు.