కరాచీ: పాకిస్థాన్ క్రికెట్‌లో మరో కలకలం రేగింది. పాకిస్థాన్ స్టార్ స్పిన్నర్ యాసిర్ షా డోపీగా తేలడంతో అతనిపై సస్సెన్షన్ వేటు పడింది. నవంబర్ 13వ తేదీన యాసిర్‌కు నిర్వహించిన డోపింగ్ టెస్టులో నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లు తేలడంతో అతన్ని సస్పండ్ చేస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసిసి) ప్రకటించింది.
ఈ మేరకు ఐసిసి ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. యాంటీ డోపింగ్ కోడ్ ప్రకారం యాసిర్ క్లోర్ టేలిడాన్ అనే మాత్రను తీసుకున్నట్లు తేలిందని తెలిపింది. ఇలా తీసుకోవడం డబ్యూఏడీఏ (వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ) జాబితాలోని సెక్షన్- 5 ప్రకారం నిబంధనలను ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలోనే యాసిర్‌ను అంతర్జాతీయ క్రికెట్ నుంచి సస్పెండ్ చేస్తున్నామని ఐసీసీ వెల్లడించింది. ఈ సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. అయితే యాసిర్‌పై ఎంతకాలం సస్పెన్షన్ వేటు పడిందనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
29ఏళ్ల యాసిర్ 2014 అక్టోబర్‌లో పాకిస్థాన్ జాతీయ జట్టుకు ఎంపికై తొలి టెస్ట్ ఆడాడు. టెస్ట్ ర్యాంకింగ్స్‌లో 4వ స్థానంలో కొనసాగుతున్నాడు. 12 టెస్టులు ఆడిన యాసిర్.. 76 వికెట్లు పడగొట్టాడు. ఒక్క 2015లోనే 49 వికెట్లు పడగొట్టాడు. కాగా, జనవరిలో న్యూజిలాండ్‌లో పాకిస్థాన్ జట్టు పర్యటించనుంది. సెస్పెన్షన్ వేటు పడటంతో ఈ పర్యటనలో యాసిర్ ఆడే అవకాశం లేకుండా పోయింది.