టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్‌ను మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కొనియాడాడు. రానున్న టీ20 వరల్ట్ కప్ భారత జట్టులో జైస్వాల్ స్థానం ఖరారైపోయింని పేర్కొన్నాడు. అయితే తనతో పోలుస్తూ జైస్వాల్‌పై ఒత్తిడికి తీసుకురావొద్దని సెహ్వాగ్ మీడియాకు సూచించాడు. అన్ని ఫార్మాట్లలో దూకుడుగా భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన సెహ్వాగ్ తరహాలోనే జైస్వాల్ కూడా అదరగొడుతున్నాడని ప్రశంసలు వస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఇతర ఆటగాళ్లతో చేసే పోలిక తెలియని ఒత్తిడిని తీసుకువస్తుందని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. తన కెరీర్ ప్రారంభంలో కూడా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌తో పోల్చారని గుర్తుచేసుకున్నాడు. ''కెరీర్ ప్రారంభ రోజుల్లో సచిన్‌తో నన్ను పోల్చారు. అయితే ఆ విషయాన్ని మన మనసులో నుంచి ఎంత తొందరగా తీసివేస్తే, అంత మంచిది. అయితే నాతో పోల్చడం జైస్వాల్‌ను ఎక్కువ ఆలోచనలకు గురిచేస్తుందని నేను భావించట్లేదు''

''కానీ పోల్చడం అనేది మిమ్మల్ని బాధిస్తుంది. నేను సచిన్‌లా ప్రదర్శన చేయలేను. సెహ్వాగ్ సెహ్వాగ్‌లానే ఉంటాడు. మీ ఆట మీకు తెలుసు. దానిపై మాత్రమే శ్రద్ధ పెట్టాలి. నేను ఇతర ఆటగాళ్లతో పోల్చడాన్ని నమ్మను. ఆ పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు నా స్టాన్స్, ఆడే విధానం మార్చుకున్నాను. ఆ తర్వాత ప్రజలు పోల్చడం మానేశారు. అయితే పోలుస్తే వచ్చే ట్యాగ్ వల్ల విపరీతమైన ఒత్తిడి ఉంటుంది''
''జైస్వాల్‌పై నాకు ఎన్నో ఆశలు ఉన్నాయి. చిన్న పట్టణం నుంచి వచ్చిన ఆటగాళ్లు తీవ్ర కష్టంతో పనిచేయాల్సి ఉంటుంది. లేకపోతే తిరిగి ఇంటికి వెళ్లాల్సి వస్తుంది. అతడు తిరిగి సూపర్ ఫామ్‌లోకి వస్తాడు. అంతేగాక రానున్న టీ20 వరల్డ్‌కప్‌కు అతడి టికెట్, వీసా ఖరారైందని నమ్ముతున్నాను'' అని సెహ్వాగ్ పేర్కొన్నాడు. ఈ సీజన్ తొలి అర్ధభాగంలో ఆకట్టుకోలేకపోయిన జైస్వాల్ ఇటీవల ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అజేయ శతకంతో చెలరేగాడు. యశస్వీ జైస్వాల్ (104*; 60 బంతుల్లో, 9x4, 7x6) జట్టును విజయ తీరాలకు చేర్చాడు.