వన్డే ఫార్మాట్‌లో అరంగేట్రం కోసం యశస్వీ జైస్వాల్ మరికొన్నాళ్లు నిరీక్షించాల్సిందే అని భారత మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ అన్నాడు. 22 ఏళ్ల జైస్వాల్ గతేడాదిగా టెస్టు, టీ20 ఫార్మాట్‌లో పరుగుల వరద పారిస్తున్న సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో 89 సగటుతో 712 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా తొమ్మిది టెస్టుల్లో 1028 పరుగులు, 23 టీ20ల్లో 723 పరుగులతో రాణిస్తున్నాడు.
అయితే టీమిండియా వన్డే జట్టులో మాత్రం జైస్వాల్ ఇప్పటివరకు ఎంపిక కాలేదు. ఇటీవల శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌కు జైస్వాల్ ఎంపిక అవుతాడని భావించినా, నిరాశే మిగిలింది. వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ వరకు ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ వన్డేల్లో అరంగేట్రం చేయడం కష్టమే అని డీకే పేర్కొన్నాడు. రోహిత్ శర్మ- శుభ్‌మన్ గిల్ ఓపెనింగ్ కాంబినేషన్ హిట్ట్ అవ్వడంతో జైస్వాల్ అవసరం ఏంటని ప్రశ్నించాడు.

ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్-గిల్ జోడీనే బరిలోకి దిగుతుందని దినేశ్ కార్తీక్ అభిప్రాయపడ్డాడు. బ్యాకప్ ఓపెనర్‌గా జైస్వాల్ ఎంపిక అవ్వొచ్చని, అయితే గిల్ దారుణంగా విఫలమైతేనే జైస్వాల్‌కు తుదిజట్టులో ఛాన్స్ దక్కుతుందని అన్నాడు. ''ఎందుకు? రోహిత్ శర్మ-శుభ్‌మన్ గిల్ కాంబినేషన్ చాలా బాగుంది కదా. బ్యాకప్ ఓపెనర్‌గా యశస్వీ జైస్వాల్‌కు ఎంపిక కావొచ్చు. కానీ గిల్ అంతగా రాణించలేకపోతేనే జైస్వాల్‌కు ఆడే అవకాశం వస్తుంది''
''ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్ మరో మూడు వన్డేలు మాత్రమే ఆడనుంది. ఈ మెగాటోర్నీలో రోహిత్-గిల్ ఓపెనర్లుగా బరిలోకి దిగుతారని గట్టిగా నమ్ముతున్నాను. టీమిండియాకు బలమైన మిడిలార్డర్ ఉంది'' అని దినేశ్ కార్తీక్ పేర్కొన్నాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పాకిస్థాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. అయితే పాక్‌లో టీమిండియా పర్యటించడంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ టోర్నీని హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించాలని బీసీసీఐ డిమాండ్ చేస్తోంది.