భారత టెస్ట్ జట్టు ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఇటీవల రెండు సెంచరీలతో అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ముఖ్యంగా ఇంగ్లండ్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో జైస్వాల్ బ్యాటింగ్ తీరు అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ అద్భుతమైన ఆటతీరుకు గానూ యశస్వి జైస్వాల్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ యశస్వి జైస్వాల్‌ను ఎంతగానో ప్రశంసించారు. ఆయన మాట్లాడుతూ.. యశస్వి జైస్వాల్ బ్యాటింగ్ చూసినప్పుడు తనకు వీరేంద్ర సెహ్వాగ్ గుర్తుకు వస్తారని అన్నారు.
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన 5 టెస్టుల సిరీస్‌లో భాగంగా.. ఐదో టెస్ట్ మ్యాచ్‌ను మైఖేల్ క్లార్క్ సమీక్షిస్తూ యశస్వి జైస్వాల్‌ను అభినందించారు. ఈ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ రెండో ఇన్నింగ్స్‌లో 118 పరుగులు చేశారు. ఈ ఇన్నింగ్స్‌తో టీమిండియా ఇంగ్లండ జట్టు ముందు 374 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు 6 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 2-2తో సమం చేసింది. ఈ విజయంపై మైఖేల్ క్లార్క్ మాట్లాడుతూ.. "మొదటి రోజు పిచ్ చూసిన తర్వాత ఈ మ్యాచ్ ఐదు రోజుల పాటు జరుగుతుందని ఎవరూ ఊహించి ఉండరు. మొదటి ఇన్నింగ్స్‌లో రెండు జట్లు కూడా మంచి స్కోరు సాధించడానికి చాలా కష్టపడ్డాయి." అని అన్నారు.

జైస్వాల్‌ను సెహ్వాగ్‌తో పోల్చిన మైఖేల్ క్లార్క్
మైఖేల్ క్లార్క్ ఇంకా మాట్లాడుతూ.. "మొదటి ఇన్నింగ్స్‌లో పిచ్ చాలా పచ్చగా ఉంది. కానీ రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 396 పరుగులు సాధించడం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ పరిస్థితులు మెరుగయ్యాయి. కానీ యశస్వి జైస్వాల్ ఆడిన తీరు అద్భుతం. రాబోయే కాలంలో అతను ఒక సూపర్ స్టార్ అవుతాడని నేను భావిస్తున్నాను. క్రికెట్‌లో ఎన్నో ఘనతలు సాధిస్తాడు. జైస్వాల్ బ్యాటింగ్ నాకు వీరేంద్ర సెహ్వాగ్‌ను గుర్తు చేస్తుంది." అని మైఖేల్ క్లార్క్ పేర్కొన్నారు.
సెహ్వాగ్ బ్యాటింగ్‌ను గుర్తుచేసుకుంటూ మైఖేల్ క్లార్క్ మాట్లాడుతూ.. "వీరేంద్ర సెహ్వాగ్ క్రీజులో ఉన్నప్పుడు అతడిని ఆపడం అసాధ్యం. ఇప్పుడు యశస్వి జైస్వాల్ బ్యాటింగ్‌లో కూడా అలాంటి మెరుపులు కనిపిస్తున్నాయి. అతను ఒక అద్భుతమైన ఆటగాడు, చాలా ప్రతిభావంతుడు" అని మైఖేల్ క్లార్క్ ప్రశంసించారు.