పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా యువ ఓపెనర్ శతకంతో కదం తొక్కాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఎనిమిది బంతులు ఎదుర్కొని డకౌటైన జైస్వాల్.. రెండో ఇన్నింగ్స్‌లో విజృంభించాడు. 205 బంతుల్లో ఎనిమిది బౌండరీలు, మూడు సిక్సర్లతో సెంచరీ సాధించాడు. హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో అప్పర్ కట్‌తో సిక్సర్ బాది జైస్వాల్ మూడంకెల స్కోరును అందుకోవడం విశేషం.
ఈ క్రమంలో జైస్వాల్ అరుదైన జాబితాలో చోటు కూడా సంపాదించాడు. ఈ శతాబ్దంలో ఆస్ట్రేలియాలో సిక్సర్‌తో శతకం అందుకున్న మూడో పర్యాటక బ్యాటర్‌గా జైస్వాల్ రికార్డు నెలకొల్పాడు. 2003లో అడిలైడ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాహుల్ ద్రవిడ్ సిక్సర్‌తో 100 సాధించాడు. 2009లో వెస్ట్రన్ ఆస్ట్రేలియా గ్రౌండ్‌లో క్రిస్ గేల్ సిక్సర్‌తో సెంచరీ అందుకున్నాడు. 15 ఏళ్ల తర్వాత ఈ ఘనతను జైస్వాల్ సాధించాడు.

కాగా, 172/0 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ఆరంభించిన టీమిండియా ఓపెనర్లు జైస్వాల్, కేఎల్ రాహుల్ (77; 176 బంతుల్లో, 4 ఫోర్లు) సాధికారికంగా బ్యాటింగ్ చేశారు. రాహుల్, జైస్వాల్ ముచ్చటైన షాట్లతో బౌండరీలు రాబట్టారు. ఈ క్రమంలో 200 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే ఆ తర్వాత కాసేపటికే రాహుల్ పెవిలియన్‌కు చేరాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించి వికెట్ కీపర్ అలెక్స్ కేరీ చేతికి రాహుల్ చిక్కాడు. ప్రస్తుతం క్రీజులో జైస్వాల్ (103), పడిక్కల్ ఉన్నారు. 64 ఓవర్లకు భారత్ స్కోరు 202/1.
What a way to bring up the ton! #AUSvIND | #MilestoneMoment | @nrmainsurance pic.twitter.com/okMDAno5tE
— cricket.com.au (@cricketcomau) November 24, 2024