ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌లో అదరగొట్టిన భారత యువ బ్యాటర్లు ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ సత్తాచాటారు. యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, ధ్రువ్ జురెల్ తమ కెరీర్‌లో అత్యుత్తమ టెస్టు ర్యాంకింగ్స్‌ను అందుకున్నారు. నాలుగు టెస్టుల్లో 655 పరుగులతో సంచలన ప్రదర్శన చేసిన జైస్వాల్ మూడు స్థానాలు ఎగబాకి 12వ ర్యాంక్ సాధించాడు.
టెస్టు ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మను జైస్వాల్ దాటేశాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ ఒక స్థానాన్ని కోల్పోయి 13వ ర్యాంక్‌లో నిలిచాడు. మరోవైపు ఇంగ్లండ్ సిరీస్‌లో రెండో అత్యధిక స్కోరర్ శుభ్‌మన్ గిల్ నాలుగు స్థానాలు ఎగబాకి ర్యాంక్‌ను మెరుగుపర్చుకున్నాడు. 31వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. ఇక రాంచీ టెస్టులో కీలక ఇన్నింగ్స్ ఆడిన వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ ఏకంగా 31 స్థానాలు దాటి 69 ర్యాంక్‌కు చేరుకున్నాడు.

దక్షిణాఫ్రికా సిరీస్‌లో మూడు శతకాలు బాదిన న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ తన అగ్రస్థానాన్ని పదిలం చేసుకున్నాడు. రెండు, మూడు స్థానాల్లో స్టీవ్ స్మిత్, జో రూట్ ఉన్నారు. నాలుగో టెస్టులో సాధించిన రూట్ రెండు స్థానాలు మెరుగుపర్చుకున్నాడు. వ్యక్తిగత కారణాలతో ఆటకు విరామం తీసుకున్న విరాట్ కోహ్లి రెండు ర్యాంక్‌లను కోల్పోయాడు. తొమ్మిదో స్థానంలో ఉన్నాడు.
టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో మనోళ్లదే హవా. తొలి రెండు స్థానాల్లో జస్‌ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ ఉన్నారు. రవీంద్ర జడేజా ఆరో స్థానంలో ఉన్నారు. ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లోనూ టాప్-2 భారత ఆటగాళ్లే ఉన్నారు. అగ్రస్థానంలో జడేజా, రెండో స్థానంలో అశ్విన్ ఉన్నారు. జో రూట్ నాలుగో స్థానానికి ఎగబాకాడు.టీమ్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా, భారత్, ఇంగ్లండ్ టాప్-3లో ఉన్నాయి. ఆసీస్, ఇండియా 117 రేటింగ్ పాయింట్లతో సమానంగా ఉండగా, ఇంగ్లండ్ 115 పాయింట్లతో నిలిచింది.