టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ అనారోగ్యం బారిన పడ్డారు. తీవ్రమైన కడుపునొప్పి కారణంగా ఆయన ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. ఈ అనారోగ్యం కారణంగా ఆయన బరువు కూడా గణనీయంగా తగ్గినట్లు తెలుస్తోంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై తరఫున ఆడుతున్న సమయంలో జైస్వాల్‌కు కడుపులో అసౌకర్యం కలిగింది. పుణెలోని ఒక హోటల్‌లో భోజనం చేసిన తర్వాత ఆయనకు ఫుడ్ పాయిజనింగ్ అయినట్లు సమాచారం. పరిస్థితి విషమించడంతో వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. అల్ట్రాసౌండ్, ఎక్స్-రే పరీక్షల తర్వాత ఆయనకు తీవ్రమైన గ్యాస్ట్రోఎంటరైటిస్ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు.
భారీగా బరువు తగ్గడంపై ఆందోళన
తాజా నివేదికల ప్రకారం.. ఈ అనారోగ్యం కారణంగా యశస్వీ జైస్వాల్ కేవలం రెండు రోజుల్లోనే 2 కిలోలకు పైగా బరువు తగ్గారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ముంబై చేరుకున్నప్పటికీ.. వైద్యులు ఆయనకు 7 నుంచి 10 రోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. "పుణెలో తిన్న ఆహారం వల్ల ఆయనకు ఫుడ్ పాయిజనింగ్ అయింది. ప్రస్తుతం ఐవీ (IV) మందులు తీసుకుంటున్నారు. కోలుకోవడానికి సమయం పడుతుంది." అని ఓ నివేదిక ప్రకారం తెలిసింది.

తదుపరి మ్యాచ్‌లపై ప్రభావం
యశస్వీ జైస్వాల్ అనారోగ్యం కారణంగా రాబోయే టోర్నమెంట్లపై నీలినీడలు కమ్ముకున్నాయి. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా డిసెంబర్ 24న సిక్కింతో జరగనున్న ముంబై తొలి మ్యాచ్‌కు యశస్వీ జైస్వాల్ అందుబాటులో ఉండటం కష్టమే అనిపిస్తోంది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మతో కలిసి జైస్వాల్ ఇన్నింగ్స్ ప్రారంభించాల్సి ఉంది. జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌ను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ (BCCI) మెడికల్ టీమ్ యశస్వీ జైస్వాల్ ఆరోగ్యాన్ని నిశితంగా గమనిస్తోంది. డిసెంబర్ 29న ఛత్తీస్‌గఢ్‌తో జరిగే మ్యాచ్ నాటికి ఆయన కోలుకుంటారో లేదో చూడాలి.