
చెలరేగిన ధూల్, రషీద్
తొలుత బ్యాటింగ్ చేసిన యువ భారత్.. ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి 37 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు హర్నూర్ సింగ్ 16, రఘువంశీ 6 పరుగులకే ఔటయ్యారు. ఈ సమయంలో కెప్టెన్ యష్ ధూల్, వైస్ కెప్టెన్ షేక్ రషీద్ జత కట్టి జట్టును ఆదుకున్నారు. ఆరంభంలో నెమ్మదిగా ఆడినప్పటికీ క్రీజులో కుదురుకున్నాక ధాటిగా ఆడారు. ఈ క్రమంలో ఇద్దరు హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత కూడా కంగారులకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగారు. ఆస్ట్రేలియా బౌలింగ్ దాడిన చీల్చి చెండడారు. ఈ క్రమంలో కెప్టెన్ యష్ ధూల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం ఇద్దరు కలిసి డబుల్ సెంచరీ భాగస్వామ్యాన్ని పూర్తి చేశారు.

రషీద్ సెంచరీ మిస్
ఈ క్రమంలో జట్టు స్కోర్ 241 పరుగుల వద్ద ఉండగా సెంచరీతో చెలరేగుతున్న కెప్టెన్ యష్ ధూల్ (110) రనౌట్ అయ్యాడు. దీంతో 204 పరుగుల డబుల్ సెంచరీ భాగస్వామ్యానికి తెరపడింది. ధూల్, రషీద్ కలిసి మూడో వికెట్‌కు 200 బంతుల్లోనే 204 పరుగులు జోడించారు. అయితే సెంచరీ ఖాయమనుకున్న తెలుగు కుర్రాడు షేక్ రషీద్ కూడా ఆ తర్వాతి బంతికే ఔటయ్యాడు. 94 పరుగులు చేసిన రషీద్ తృటిలో సెంచరీ చేజార్జుకున్నాడు. మొత్తంగా 108 బంతులు ఎదుర్కొన్న షేక్ రషీద్ 8 ఫోర్లు, ఒక సిక్సుతో 94 పరుగులు చేశాడు.

చివర్లో భారీగా పరుగులు
ఇక చివర్లో రాజవర్దన్ (13), నిశాంత్ సింధు(12*), దినేష్ బానా(20*) ధాటిగా ఆడారు. దినేష్ బానా 4 బంతుల్లోనే 20 పరుగులు చేశాడు. ఇందులో 2 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. దీంతో చివరి ఓవర్‌లో 27 పరుగులు వచ్చాయి. ఇక చివరి 10 ఓవర్లలోనే యువ భారత్ 108 పరుగులు రాబట్టింది. దీంతో నిర్ణీత 50 ఓవర్లు ముగిసే సమయానికి యువ భారత్ 5 వికెట్ల నష్టానికి 290 పరుగుల భారీ స్కోర్ చేసింది. కంగారుల ముందు 291 పరుగులు భారీ టార్గెట్‌ను ఉంచింది.

చెలరేగిన బౌలర్లు
అనంతరం 291 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాను టీమిండియా బౌలర్లు కంగు తినిపింంచారు. భారత బౌలర్ల ధాటికి కంగారులు ఏ దశలోనూ లక్ష్యాన్ని చేధించేలా కనిపించలేదు. దీంతో 41.5 ఓవర్లలో 194 పరుగులకే ఆస్ట్రేలియా అండర్ 19 జట్టు కుప్పకూలింది. దీంతో 96 పరుగులు భారీ తేడాతో గెలిచిన భారత్ ఫైనల్‌లో ఘనంగా అడుగుపెట్టింది.
ఆసీస్ బ్యాటర్లలో లచ్లాన్ షా (51), కొరే మిల్లర్ (38), కాంప్‌బెల్ కెల్లావే (30), జాక్ సిన్ఫీల్డ్ (20), టామ్ విట్నీ (19) మాత్రమే చెప్పుకోదగ్గ పరుగులు చేశారు. ఇక భారత బౌలర్లలో విక్కీ ఓస్ట్వాల్ 3, నిశాంత్ సింధు, రవి కుమార్ రెండేసి, కౌశల్ థాంబే, రఘువంశీ తలో వికెట్ తీశారు. సెంచరీతో చెలరేగిన టీమిండియా కెప్టెన్ యష్ ధూల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. కాగా భారత అండర్ 19 జట్టు ఫైనల్‌లో ఇంగ్లండ్ అండర్ 19 జట్టుతో తలపడనుంది.


Click it and Unblock the Notifications












