Yash Dayal: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) తరఫున బౌలింగ్ చేస్తున్న యువ పేసర్ యశ్ దయాల్ ఇప్పుడు పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ యువతి ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను ఐదేళ్లుగా శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా మోసం చేశాడని ఆరోపిస్తూ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేసింది. వెళ్లి చేసుకుంటానని తనను నమ్మించి యశ్ దయాల్ మోసం చేశాడని.. లైంగిక వేధింపులకు గురి చేశాడని పేర్కొంది. తనతో అన్ని రకాలుగా సంబంధం పెట్టుకున్నాడని ఉజ్వల సింగ్ అనే ఆ అమ్మాయి పేర్కొంది. అయితే ఇప్పుడు తీరా పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి తప్పించుకుంటున్నాడని ఆ యువతి ఫిర్యాదులో వెల్లడించింది. అతను ఇతర అమ్మాయిలతో కూడా సంబంధాలు పెట్టుకుని తనను మోసం చేశాడని ఆరోపించింది.
ఘజియాబాద్‌కు చెందిన బాధితురాలు తన ఫిర్యాదులో కీలక విషయాలను వెల్లడించింది. ప్రేమ పేరుతో మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా మోసపోయానని పేర్కొంది. తనను కుటుంబ సభ్యులకు కోడలిగా కూడా పరిచయం చేశాడని.. తన నమ్మకాన్ని వమ్ము చేశాడని ఆరోపించింది. పెళ్లి పేరుతో తనను పూర్తిగా వాడుకున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. అతడి మోసాన్ని గ్రహించి నిలదీయడంతో తనపై శారీరక హింసకు పాల్పడి, మానసిక వేదనకు గురి చేశాడని ఆరోపించింది. తన వద్ద స్క్రీన్ షాట్లు, ఫోటోలు, వీడియో కాల్స్, చాట్ రికార్డుల్లాంటి పక్కా ఆధారాలు ఉన్నాయని ఆమె వెల్లడించింది. రిలేషన్‌లో ఉన్న సమయంలో డబ్బులు తీసుకున్నట్లు కూడా పేర్కొంది. ఇదే విధంగా యశ్ దయాల్ ఇతర యువతులను కూడా మోసం చేశాడనే విషయం తనకు తెలిసిందని ఆరోపించింది.

ఆధారాలు ఉన్నాయంటున్న బాధితురాలు
ఈ విషయంపై జూలై 14, 2025న కూడా మహిళా హెల్ప్‌లైన్ 181కి కాల్ చేసి ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించానని, అయితే పోలీసు స్టేషన్ నుండి ప్రక్రియ ముందుకు సాగలేదని బాధితురాలు వాపోయింది. దీని తర్వాత ఇప్పుడు బాధితురాలు నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయంలో న్యాయం కోసం వేడుకుంటోంది. ఈ ఆరోపణలన్నింటినీ నిరూపించడానికి తన వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని బాధితురాలు పేర్కొంటోంది. ఈ కేసుకు సంబంధించిన చాట్‌లు, స్క్రీన్‌షాట్‌లు, వీడియో కాల్ రికార్డింగ్‌లు తన వద్ద ఉన్నాయని తెలిపింది. ప్రస్తుతానికి, ఆమె వీలైనంత త్వరగా నిందితుడు యశ్ దయాల్‌కు శిక్ష పడేలా చూడాలని కోరుతోంది.
స్పందించిన సీఎంవో
ఆ యువతి చేసిన ఫిర్యాదుపై సీఎంవో వెంటనే స్పందించింది. ఘజియాబాద్ లోని ఇందిరాపురం సర్కిల్ ఆఫీసర్‌ను విచారణకు ఆదేశిచింది. ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా అందిన ఈ ఫిర్యాదు జులై 21 లోగా పరిష్కరించి.. పూర్తి నివేదికను సమర్పించాలని పోలీసు ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీనిపై యశ్ దయాల్ ఇంకా స్పందించకపోవడం గమనార్హం.
ఐపీఎల్ విజేత జట్టులో భాగం
ఐపీఎల్ 2025లో ఆర్‌సీబీ జట్టు అద్భుతమైన ప్రదర్శన చేసి టైటిల్ గెలుచుకుంది. యశ్ దయాల్ ఈ జట్టులో కీలక సభ్యుడు. ఆర్‌సీబీ విజయానికి తన బౌలింగ్‌తో ముఖ్యమైన సహకారం అందించాడు. పంజాబ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కూడా అతను ఒక వికెట్ సాధించాడు. ఈ సీజన్‌లో జట్టు కోసం ఆడిన 15 మ్యాచ్‌ల్లో దయాల్ 13 వికెట్లు పడగొట్టాడు.