WTC final: కోహ్లీసేన..సుదీర్ఘ పర్యటన: ఛార్టెడ్ ఫ్లైట్ రెడీ: ఆ డౌట్స్‌పై జాయింట్ స్టేట్‌మెంట్

లండన్: భారత క్రికెట్ జట్టు సుదీర్ఘ పర్యటన ఇవ్వాళ ప్రారంభం కానుంది. టీమిండియా క్రికెటర్లు.. వారి భార్యాబిడ్డలతో సహా ఇంగ్లాండ్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. వారి కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రత్యేకంగా ఛార్టెడ్ ఫ్లైట్‌ను ఏర్పాటు చేసింది. ఈ సాయంత్రం వారంతా లండన్‌కు బయలుదేరి వెళ్తారు. మరుసటి రోజు ఉదయం అక్కడ అడుగు పెడతారు.
నాలుగున్నర నెలల పాటు భారత జట్టు ఇంగ్లాండ్‌లో పర్యటించాల్సి ఉన్నందున.. అక్కడి ప్రభుత్వం క్రికెటర్ల కుటుంబ సభ్యులకు కూడా అనుమతి ఇచ్చింది. ఇంగ్లాండ్‌లో అడుగు పెట్టనున్న టీమిండియా.. మళ్లీ అక్కడి నుంచి బయటపడేది సెప్టెంబర్ 15వ తేదీ తరువాతే.

డబ్ల్యూటీసీ ఫైనల్ పైనే
ఈ నెల 18వ తేదీన సౌథాంప్టన్‌లోని రోజ్ బౌల్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్‌లో తలపడుతుంది. దీని తరువాత.. 42 రోజుల పాటు అక్కడే ఖాళీగా గడుపుతుంది. బీసీసీఐ డిజైన్ చేసిన షెడ్యూల్ ప్రకారం.. జూన్ 22వ తేదీన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ముగిసిన తరువాత.. ఇంగ్లాండ్‌తో తొలి టెస్ట్ ఆరంభం కావడానికీ మధ్య నెలన్నర వ్యవధి ఏర్పడింది. అంటే 42 రోజుల పాటు భారత జట్టు ఇంగ్లాండ్‌లో ఖాళీగా ఉంటుంది. ఇంగ్లాండ్‌తో టీమిండియా అయిదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను ఆడుతుంది.

ఇదీ షెడ్యూల్..
తొలి టెస్ట్ ఆగస్టు 4వ తేదీన నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్‌బ్రిడ్జ్‌లో ఆరంభమౌతుంది. చివరి టెస్ట్ సెప్టెంబర్ 14వ తేదీన ముగుస్తుంది. అదే నెల 12 నుంచి 16 మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ లండన్‌లో, 25 నుంచి 29 మధ్య మూడో టెస్ట్ లీడ్స్‌లోని హెడింగ్లే స్టేడియంలో షెడ్యూల్ చేసింది బీసీసీఐ-ఈసీబీ. నాలుగో టెస్ట్ మ్యాచ్ సెప్టెంబర్ 2వ తేదీన ఉంటుంది.
లండన్‌లోని కెన్నింగ్‌టన్ ఓవల్‌లో ఈ మ్యాచ్ ఆరంభమౌతుంది. అయిదో టెస్ట్‌కు మాంఛెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ వేదికైంది. సెప్టెంబర్ 14వ తేదీన చివరి టెస్ట్ ముగుస్తుంది.

జాయింట్ ప్రెస్‌మీట్..
ఈ పర్యటన నేపథ్యంలో.. విమానం ఎక్కడానికి ముందు కేప్టెన్ విరాట్ కోహ్లీ.. కోచ్ రవిశాస్త్రి విలేకరులతో భేటీ కానున్నారు. ఈ సాయంత్రం 5 గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్‌ను ఏర్పాటు చేశారు. పలు కీలక అంశాలు ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ప్రత్యేకించి- డబ్ల్యూటీసీ ఫైనల్-ఇంగ్లాండ్‌తో తొలిటెస్ట్ మధ్య ఉన్న గ్యాప్ గురించి వారు వివరణ ఇవ్వొచ్చు. అలాగే- టీ20 ప్రపంచకప్, ఐపీఎల్ 2021 ఫేస్ 2 వంటి కీలక టోర్నమెంట్లలో భారత క్రికెట్ జట్టు ఆటతీరు, ఆటగాళ్లు, జట్టు కూర్పు వంటి పలు అంశాలపై అభిమానుల్లో ఉన్న సందేహాలకు కోహ్లీ, రవిశాస్త్రి సమాధానం ఇచ్చే ఛాన్స్ ఉంది.

వెంగీ అనుమానాలపై..
ఒకవంక- శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌కు ముందు వన్డే ఇంటర్నేషనల్స్, టీ20 మ్యాచ్‌లను ఆడేలా షెడ్యూల్ రూపొందించుకోగా.. దానికి భిన్నంగా బీసీసీఐ టెస్ట్ మ్యాచ్‌లను ఆడనివ్వటంలో అర్థం లేదంటూ ఇటీవలే వెంగ్‌సర్కార్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
భారత్‌తో అయిదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను ఆడబోయే ఇంగ్లాండ్ జట్టు కూడా బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లతో లిమిటెడ్ ఓవర్ల మ్యాచ్‌లను ఆడుతుందని గుర్తు చేశారు. టీ20 ప్రపంచకప్ ముందు టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్‌ను ఆడే అవకాశం లేదని, వారి ముందున్నది ఐపీఎల్ 2021లో మిగిలిపోయిన మ్యాచ్‌లేనని చెప్పారు. దీనిపైనా కోహ్లీ-రవిశాస్త్రి జోడీ వివరణ ఇస్తుందని భావిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications