వరుసగా రెండోసారి డబ్ల్యూటీసీ ఫైనల్ చేరిన భారత జట్టు.. ఈసారి ఎలాగైనా ట్రోఫీ నెగ్గాలని పట్టుదలగా ఉంది. ఈ క్రమంలోనే ఐపీఎల్ ఫీవర్ తగ్గించుకునేందుకు జట్టు అంతా వారం రోజులు ముందుగానే ఇంగ్లండ్ చేరుకొని ప్రాక్టీస్ మొదలు పెట్టింది. అయితే గెలవడంలో జట్టు ఎంపిక కూడా చాలా ముఖ్యమని మాజీ దిగ్గజం ఎమెస్కే ప్రసాద్ చెప్తున్నాడు.
గత డబ్ల్యూటీసీ ఫైనల్‌లో అసలు భారత్ గెలవాల్సిందని, కానీ సరైన జట్టును ఎంపిక చేయకపోవడం వల్లనే అప్పుడు టీమిండియా ఓడిందని ప్రసాద్ అంటున్నాడు. 'గతంలో ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలో దిగాలమని ముందు నుంచి టీమిండియా అనుకుంది. కానీ అప్పుడు వర్షం పడింది. అప్పుడైనా ప్లాన్ మార్చుకోవాల్సింది' అని గుర్తుచేశాడు.

సౌతాంప్టన్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో వర్షం పడినా కూడా టీమిండియా తాము అనుకున్నట్లే ఇద్దరు స్పిన్నర్లతో బరిలో దిగింది. ఈ వ్యూహం ఫలించలేదు. పిచ్ పేసర్లకు బాగా సహకరించడంతో న్యూజిల్యాండ్ ఈ మ్యాచ్ గెలిచి డబ్ల్యూటీసీ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఓవల్‌లో కూడా పిచ్ నుంచి స్పిన్నర్లకు సహకారం అందుతుందని అంతా అంటున్నారు.
దీంతో ఈ మ్యాచ్‌లో కూడా జడేజా, అశ్విన్ ఇద్దరినీ బరిలో దింపాలని టీమిండియా భావిస్తోంది. అయితే ఇలా తొందరపడి నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదని ఎమ్మెస్కే ప్రసాద్ అభిప్రాయం. 'ఓవల్‌లో పరిస్థితులపై ఆధారపడి జట్టును ఎంపిక చేయాలి. ఐదు రోజుల పాటు పిచ్, వాతావరణం ఎలా ఉంటాయో చెప్పలేం. కాబట్టి ముందే అనుకున్నాం కదా అని బరిలో దిగకూడదు. పరిస్థితులు అర్థం చేసుకొని నమ్మకం ఉన్న జట్టుతో ఆడాలి' అని వివరించాడు.
ఈ మ్యాచ్‌లో జడ్డూ, అశ్విన్ ఇద్దర్నీ ఆడించడం టీమిండియాకు సవాల్ అవుతుందని ఇప్పటికే చాలా మంది అభిప్రాయపడుతున్నారు. వెటరన్ బ్యాటర్ దినేష్ కార్తీక్, హర్భజన్ సింగ్ తదితరులు కూడా ఈ విషయంపై స్పందించారు. ఇద్దరు స్పిన్నర్లతో బరిలో దిగడం కరెక్టా? కాదా? అని మాత్రం ఇప్పటికీ టీమిండియా ఒక నిర్ణయానికి రాలేదని తెలుస్తోంది.